హెజ్బొల్లా పేజర్ల పేలుడు ఘటనలో.. కేరళ బిజినెస్ మాన్ పేరు తెరపైకి!

హెజ్బొల్లా పేజర్ల పేలుడు ఘటనలో.. కేరళ బిజినెస్ మాన్ పేరు తెరపైకి!
  • నార్వేలో స్థిరపడి, బల్గేరియాలో కంపెనీ పెట్టిన రిన్సన్ జోస్ 
  • హెజ్బొల్లాకు అతడే పేజర్లు సప్లై చేసినట్టుగా వార్తలు

 న్యూఢిల్లీ: లెబనాన్​లో ఒకేసారి వేలాది పేజర్లు పేలిపోయి హెజ్బొల్లాకు చెందిన 32 మంది మిలిటెంట్లు మృతిచెందడంతోపాటు మరో 2 వేలకుపైగా మిలిటెంట్లు గాయపడిన ఘటన వెనక కేరళకు చెందిన ఓ బిజినెస్​ మాన్ పేరు తెరపైకి రావడం సంచలనం సృష్టించింది. కేరళలోని వయనాడ్​కు చెందిన రిన్సన్ జోస్ అనే 37 ఏండ్ల బిజినెస్ మాన్ నార్వేలో స్థిరపడ్డారు. ఆయన బల్గేరియాలో పెట్టిన నోర్టా గ్లోబల్ అనే కంపెనీ నుంచే హెజ్బొల్లాకు పేజర్లు సరఫరా అయ్యాయంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. . వయనాడ్​కు చెందిన రిన్సన్ జోస్ తండ్రి ఒక సాధారణ టైలర్. 

ఎంబీఏ చదివిన రిన్సన్ కొన్నేండ్ల క్రితం నార్వేకు వెళ్లి స్థిరపడ్డారు. బిజినెస్ మాన్​గా మారి ఆ దేశ పౌరసత్వం తీసుకున్నారు. తర్వాత బల్గేరియాలో నోర్టా గ్లోబల్ పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. వందకుపైగా కంపెనీలకు హెడ్ క్వార్టర్స్ సర్వీసెస్ అందిస్తున్నారు. అయితే, హెజ్బొల్లా మిలిటెంట్ల చేతుల్లో పేలిన పేజర్లు సప్లై చేసింది నోర్టా గ్లోబల్ కంపెనీయే అన్న వార్తలు రావడంతో బల్గేరియా సెక్యూరిటీ ఏజెన్సీ ‘ఎస్ఏఎన్ఎస్’ దర్యాప్తు చేపట్టింది. బల్గేరియాలో అలాంటి పేజర్లు తయారు కాలేదని, ఎగుమతులు, దిగుమతులు కూడా జరగలేదని తేల్చింది. రిన్సన్ జోస్​కు ఆ పేజర్లతో ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో రిన్సన్ పేరు తెరపైకి రావడం కేరళలో సంచలనంగా మారింది. 

నకిలీ కంపెనీలతో పక్కా ప్లాన్..
హెజ్బొల్లా కొనుగోలు చేసిన పేజర్లు తైవాన్​కు చెందిన గోల్డ్ అపొల్లో కంపెనీ బ్రాండ్ నేమ్​తో ఉన్నాయని వార్తలు వచ్చాయి. దీనిపై ఆ కంపెనీ ప్రెసిడెంట్ సూ చింగ్ కౌంగ్ స్పందిస్తూ.. తమ బ్రాండ్ నేమ్ ను వాడుకునేందుకు బుడాపెస్ట్​లోని బీఏసీ కన్సల్టింగ్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుందని, అంతేతప్ప ఆ పేజర్లతో తమకు సంబంధంలేదని తేల్చిచెప్పారు. దీంతో ఇటాలియన్ హంగేరియన్ సీఈవో క్రిస్టియానా బర్సోనీ అర్కిడియాకొనో బుడాపెస్ట్ లో స్థాపించిన బీఏసీ కన్సల్టింగ్ అనే కంపెనీ పేజర్ల సప్లై వెనక కీలక పాత్ర పోషించినట్టు కథనాలు వచ్చాయి.