విశ్లేషణ: జీఎస్టీలో శ్లాబులు తగ్గాలె

ఒకే దేశం.. ఒకే పన్ను అంటూ కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను తీసుకొచ్చింది. అయితే మరే దేశంలోనూ లేనంత సంక్లిష్టంగా మనదేశంలో జీఎస్టీ విధానం మారింది. రాష్ట్రాలు కూడా జీఎస్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రం ఎక్కువ నిధులు పొందుతోందని, రాష్ట్రాలకు తక్కువ కేటాయిస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే జీఎస్టీ కౌన్సిల్​ మీటింగ్​ లో నిర్ణయించిన ప్రకారమే జీఎస్టీ విధానం అమలవుతోంది. నిర్దేశించిన నిష్పత్తి ప్రకారమే రాష్ట్రాలకు పన్ను వాటాను కేంద్రం చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీలో మరికొన్ని మార్పులు రావాలి. ఇప్పుడు ఉన్న శ్లాబులను కూడా తగ్గించాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయాలి.

దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి.. ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా 2017 జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను అమలులోకి తెచ్చింది. అప్పటి వరకు మనదేశంలో అమలులో ఉన్న సంక్లిష్టమైన పరోక్ష పన్నుల వ్యవస్థ స్థానంలో సరళమైన పన్ను విధానం ఆవిష్కృతమవుతుందని అంతా ఆశించారు. అంతకుముందు వరకు వస్తు, సేవలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో రకరకాలైన పరోక్ష పన్నుల విధానం అమలులో ఉంది. దీని వల్ల ఒకే వస్తువు లేదా సేవకు సంబంధించి ఎక్కువసార్లు జనం పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. జీఎస్టీ రాకతో ప్రజలపై పరోక్ష పన్నుల భారం తగ్గుతుందని కేంద్రం భావించింది. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అంచనా వేసింది. జీఎస్టీ అమలులోనికి వచ్చిన తర్వాత అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో పన్ను ఎగవేతదారులకు ముకుతాడు వేసినట్లయ్యింది. సీజీఎస్టీ, ఎస్​జీఎస్టీ కింద కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరుగా పన్నుల ఆదాయం పోతోంది. సీజీఎస్టీలో రాష్ట్రాల వాటాను కేంద్రం ఎప్పటికప్పుడు చెల్లిస్తూ వస్తోంది. 

140కిపైగా దేశాల్లో జీఎస్టీ అమలు
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, దేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థలోని లోపాలు పరిష్కరించేందుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి. వీపీ సింగ్​ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడే విలువ జోడింపు పన్ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు జరిగాయి. ఆ తర్వాత మన్మోహన్​సింగ్​ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీని తీసుకొచ్చేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం అడుగులు వేసింది. కానీ, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జీఎస్టీ విధానం అమలులోకి వచ్చింది. ప్రపంచంలో తొలిసారిగా 1954లో ఫ్రాన్స్ వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 140 దేశాలు జీఎస్టీకి మారాయి. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఇప్పటివరకు జీఎస్టీకి మారలేదు. మరోవైపు చైనా మాత్రం వ్యాట్ విధానాన్నే అనుసరిస్తోంది. సింగపూర్ లో మూడు శ్లాబులు ఉండగా, మిగతా దేశాలన్నీ ఒకే శ్లాబ్ ను పాటిస్తున్నాయి. ఇతర దేశాల్లో అమలవుతున్న జీఎస్టీకి.. మనదేశంలోని జీఎస్టీకి ఏమాత్రం పోలికలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరోక్షంగా వినియోగదారులపై వేసే పన్ను స్థానంలో జీఎస్టీని ప్రవేశపెట్టారు. లిక్కర్, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించారు. మనదేశంలో ఐదు శ్లాబుల్లో జీఎస్టీని అమలు చేస్తున్నారు. 

దేశమంతటా ఒకటే పన్ను
జీఎస్టీతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ వస్తువు కొన్నా ఒకే మాదిరిగా పన్ను ఉంటుందని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. జీఎస్టీ వల్ల సామాన్యులు లాభపడతారని కూడా ప్రచారం జరిగింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని ముందుగా స్వాగతించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు జీఎస్టీ విధానానికి సంబంధించి కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జీఎస్టీ మండలి ఏర్పాటైంది. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పన్నుల విధానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోతున్నాయని చెప్పవచ్చు. సామాన్యులు పన్నులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పటికీ వాటిని తగ్గిస్తే తమకు ఆర్థిక వనరులు తగ్గిపోతాయని పన్నుల విధానంలో మార్పులు తీసుకురావడం లేదు. జీఎస్టీ వల్ల పన్నుల రాబడి ఏటా 14 శాతం చొప్పున పెరుగుతుందని తొలుత అంచనా వేసుకున్నాయి. ఏమాత్రం లోటు ఏర్పడినా నష్టపరిహారం భర్తీ చేస్తామని రాష్ట్రాలకు కేంద్రం హామీ ఇచ్చింది. చాలా రాష్ట్రాలకు 2015 నుంచి పన్నుల ఆదాయం ఐదు శాతం నుంచి 12 శాతం వరకు పెరిగింది. అనేక రాష్ట్రాల్లో భారీ కంపెనీలకు జీఎస్టీతో లాభం చేకూరింది. ఎంఎస్ఎంఈకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది.

దిగజారిన ఆర్థిక పరిస్థితులు
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారింది. ముఖ్యంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దీనికి ప్రధానమైన కారణం పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు బదిలీ విధానం పూర్తిగా ఆన్​లైన్​కు మారడమే. దీంతో మనిషికి మనిషికి మధ్య డబ్బు చెలామణి లేకుండా పోయింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నా నేటికీ గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల సురక్షితమైన తాగునీటికి నోచుకోని ప్రాంతాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఏటా ప్రజారోగ్యం మీద వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా క్షేత్ర స్థాయిలో దుర్భర పరిస్థితులు, వ్యవస్థాగత లోపాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు దారుణంగా దెబ్బతిన్నాయి. మనదేశంలో కూడా కరోనా కారణంగా 2020 మార్చి 23 నుంచి లాక్​డౌన్​ విధించారు. దీంతో అన్నీ బంద్ కావడం వల్ల ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు లేకపోవడం వల్ల జీడీపీ తగ్గిపోయింది. జీఎస్టీ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చాలామంది ఆరోపించారు. అయితే అమెరికాలో కరోనా తొలి దశ విజృంభించిన సమయంలో అప్పటి ట్రంప్​ ప్రభుత్వం లాక్ డౌన్ విధించకపోవడం వల్ల లక్షల్లో ప్రాణనష్టం జరిగింది. కానీ మనదేశంలో లాక్​డౌన్​ విధించడం వల్ల ప్రాణనష్టం చాలా తక్కువగానే నమోదైంది.

నిర్దేశించిన నిష్పత్తిలోనే వాటా చెల్లింపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే దేశంలో పన్నుల విధింపు జరుగుతోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికంగా పన్నులు వసూలు చేస్తోందని, కేంద్రానికి ఎక్కువగా నిధులు పోతున్నాయని, రాష్ట్రాలకు కేంద్రం నుంచి పన్నుల రూపంలో తక్కువగా నిధులు వస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నాయి. వాస్తవానికి నిర్దేశించిన నిష్పత్తిలోనే కేంద్రం రాష్ట్రాలకు పన్నుల వాటాను చెల్లిస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆర్థికంగా దెబ్బతినడంతో కొనుగోలు శక్తి తగ్గి చాలా వరకు వ్యాపారాలు మందకొడిగా సాగుతున్నాయి. మరోవైపు కరోనా తర్వాత చిన్న, పెద్ద తరహా పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన వస్తువులపై ధరలు విపరీతంగా పెంచేశారు. గతంలో ఉన్న దానికంటే రెట్టింపు ధరలకు వస్తువులను అమ్మడం వల్ల సామాన్యులపై ఎక్కువ ప్రభావం పడుతోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ విధానంలో సరళీకరణ తీసుకురావాలి. ప్రస్తుతం ఐదుగా ఉన్న శ్లాబులను కూడా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. నిత్యావసరాలపై ఎక్కువ పన్నులు లేకుండా చూడాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు రావాలి. సామాన్యుల కొనుగోలు శక్తికి తగినట్లుగా పన్నులు ఉంటే బాగుంటుంది. అవి దేశాభివృద్ధికి దోహదపడతాయి.

- డా.రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ