- రేట్లు ఇంకా తగ్గుతాయంటున్న ఎనలిస్టులు
బిజినెస్‌డెస్క్, వెలుగు: గోల్డ్ ధరలు నాలుగు నెలల కనిష్టాలకు పడిపోయాయి. బంగారం రేట్లు పడిన ప్రతీసారి ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరియైన టైమా? అని ఆలోచనలో పడతారు ఇన్వెస్టర్లు. లాంగ్ టెర్మ్ కోసం చూసుకుంటే గోల్డ్ ను కొనుక్కోవడం బెటర్ అని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు. కానీ, షార్ట్ టెర్మ్ కోసం చూసుకుంటే మాత్రం గోల్డ్ రేట్లు ఇప్పటిలో పెరిగే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. ఇంటర్నేషనల్‌గా, డొమెస్టిక్‌గా చూసుకుంటే గోల్డ్ అవుట్ లుక్ బేరిష్‌గా ఉందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పది గ్రాముల గోల్డ్ రేటు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ. 48 వేల వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ రూ. 46,930 వద్ద క్లోజయ్యింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్సు గోల్డ్ 1,781.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
గోల్డ్ ఎటువైపు..
కిందటి వారంలో యూఎస్ జాబ్స్ డేటా మెరుగ్గా ఉండడంతో గోల్డ్ ధరలు భారీగా క్రాష్ అవ్వడం చూశాం. మేజర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడడం కూడా బంగారం రేట్లు పడడానికి కారణమయ్యింది. ఈ నెల 9 న గోల్డ్ ఔన్సు ధర 1,720 డాలర్లకు పతనమయ్యింది. కానీ, తాజాగా గోల్డ్ రేట్లు తిరిగి రీబౌండ్ అవుతున్నాయి. కరోనా డెల్టా వేరియంట్ విస్తరిస్తుండడంతో గోల్డ్ రేట్లు తిరిగి పెరుగుతున్నాయి. కానీ, ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుతుందా? గోల్డ్ మరింత పెరుగుతుందని ఎనలిస్టులు అనుకోవడం లేదు. దీనికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు. గోల్డ్ అవుట్ లుక్ నెగెటివ్‌గానే ఉందని బ్రోకరేజి కంపెనీ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. గ్లోబల్‌గా ఔన్సు గోల్డ్ రేటు 1,815 డాలర్లకు దిగువన ట్రేడయ్యేంత వరకు గోల్డ్ అవుట్ లుక్ బేరిష్‌గానే ఉంటుందని తెలిపింది. 1, 680 డాలర్లకు పడిపోతే కొనుగోళ్లు పెరగొచ్చని అంచనావేసింది. యూఎస్ ఇన్‌ఫ్లేషన్ పెరుగుతోంది. దీన్ని కట్టడి చేసేందుకు ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ నిర్ణయం డాలర్ బలపడడానికి కారణమవుతుందని, గోల్డ్ రేట్లు పడతాయని అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ మార్కెట్‌లో కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు నాలుగు నెలల కనిష్టానికి తగ్గి రూ. 45,800 ను తాకడాన్ని చూశాం.
బాండ్ ఈల్డ్ పడినా..
గోల్డ్ రేట్లను ఎక్కువగా ప్రభావితం చేసేది ఇంటర్నేషనల్ అంశాలే. ముఖ్యంగా యూఎస్ ఎకనామిక్ డేటా మెరుగ్గా ఉండడం గోల్డ్‌పై నెగెటివ్ ప్రభావాన్ని చూపుతోంది. ట్రెజరీ ఈల్డ్స్ పడినప్పుడు గోల్డ్ కొనుగోళ్ల వైపు ఇన్వెస్టర్లు చూస్తారు. కానీ, నెల రోజుల నుంచి ఈల్డ్స్ తగ్గుతున్నా, గోల్డ్ రేట్లు పెరగలేదు. గోల్డ్‌పై ఇన్వెస్టర్లు నెగెటివ్ సెంటిమెంట్‌తో ఉన్నారనే విషయం అర్థమవుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ మెటల్ ధరలు కీలక స్థాయిలను చేరుకోలేకపోతే, మరింత పడుతుందని అంచనావేస్తున్నారు. కాగా, బాండ్లపై వచ్చే రిటర్న్‌ను బాండ్ ఈల్డ్ అంటారు.
గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి బయటకు..
గోల్డ్ రేట్లు గతేడాది పెరగడంలో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లు కీలకంగా ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రాసెస్ వేగంగా జరుగుతుండడం, పశ్చిమ దేశాలు అనుకున్నదానికంటే వేగంగా కరోనా నుంచి రికవరీ అవ్వడం గోల్డ్‌పై నెగెటివ్ ప్రభావాన్ని చూపుతోంది. దీంతో చిన్న ఇన్వెస్టర్ల నుంచి పెద్ద పెద్ద పెన్షన్ ఫండ్స్ వరకు గోల్డ్ ఈటీఎఫ్‌లలో తమ హోల్డింగ్స్‌ను తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గాయి. ఇండియా వంటి దేశాల్లో గోల్డ్ వాడకం ఎక్కువ. కానీ, మన దగ్గర కూడా ఈ ఏడాది గోల్డ్ డిమాండ్ తగ్గింది. దీంతో ఇంపోర్ట్స్ పడిపోయాయి. ఇది గోల్డ్ ధరలు తగ్గడానికి కారణమవుతోంది.
గత 75 ఏళ్లలో 54 వేల శాతం పెరిగిన గోల్డ్..
గోల్డ్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు గోల్డ్ రేట్లు 54,000 శాతం పెరిగాయి. పది గ్రాముల గోల్డ్ రేటు 1947 లో రూ. 88.62 గా ఉంది. ఆదివారం నాటికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రేటు రూ. 48 వేలకు చేరుకుంది. ఈక్విటీ, బాండ్ వంటి ఇన్వెస్ట్‌మెంట్లు రిస్క్‌గా మారినప్పుడు గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు చూస్తుంటారు. ముఖ్యంగా గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ (ఆర్థిక మాంద్యం) –2008 తర్వాత నుంచి గోల్డ్ ధరలు ఎక్కువగా పెరిగాయి. 2008 లో 10 గ్రాముల గోల్డ్ రూ. 12,500 గా ఉంది. ఇండియన్స్‌కు ఇష్టమైన ఇన్వెస్ట్‌మెంట్ అసెట్‌గా గోల్డ్ నిలుస్తూ వస్తోందని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ అనుజ్ గుప్తా అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గోల్డ్ కొనడం పెరుగుతూ వచ్చిందన్నారు.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి ?
లాంగ్ టెర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ మంచి అసెట్‌గా చూడొచ్చని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గోల్డ్ రేట్లు నాలుగు నెలల కనిష్టాలకు పడిపోయాయి. ఈ టైమ్‌లో గోల్డ్‌ను కొనుక్కోవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్) సుగంధ సచ్‌దేవ అన్నారు. ‘లాంగ్ టెర్మ్ కోసం అయితే గోల్డ్ అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు ధర 1,680 డాలర్ల వద్ద గోల్డ్‌కు మంచి సపోర్ట్ లభిస్తోంది. ఎంసీఎక్స్‌లో కూడా 10 గ్రాముల గోల్డ్‌కు రూ. 44,700 నుంచి రూ. 45,300 మధ్య స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్వెస్టర్లు గోల్డ్‌ను కొనడం ప్రారంభించాలి. ఈ లెవెల్స్ నుంచి గోల్డ్ రేట్లు రివర్స్ అవుతాయి’ అని అభిప్రాయపడ్డారు.