అడుగుపడని హ్యాండ్లూమ్​ పార్క్ ..నిధులున్నా పట్టింపు కరువు

అడుగుపడని హ్యాండ్లూమ్​ పార్క్ ..నిధులున్నా పట్టింపు కరువు
  • 2008 లో మంజూరు
  • అనంతపురంలో 50  ఎకరాలు కేటాయింపు
  • నిధులున్నా పట్టింపు కరువు
  • పార్క్​స్థలాన్ని తవ్వేస్తున్న మట్టి మాఫియా

గద్వాల, వెలుగు: ఏండ్ల కొద్దీ ఎదురుచూస్తున్నా.. హ్యాండ్లూమ్ పార్క్ పనులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఈ పార్క్ కోసం 2008లో అప్పటి మినిస్టర్ ​డీకే అరుణ గద్వాల మండలం అనంతపురం శివారులోని సర్వే నంబర్368లో 50 ఎకరాల స్థలం కేటాయించారు.  దీన్ని అభివృద్ధి చేసేందుకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఈ డబ్బులను సెక్యూరిటీ గార్డు నియామకంతోపాటు స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసేందుకు ఖర్చు చేయాలని చెప్పారు.  

ఖర్చులకు కాకి లెక్కలు

హ్యాండ్లూమ్ పార్క్ స్థలం చుట్టూ దిమ్మెలు కట్టామని, సెక్యూరిటీ గార్డును నియమించామని, దాదాపు రూ.8‌‌‌‌.50 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత ఫొటోగ్రఫీ సర్వే చేశామంటూ రూ.2.50 లక్షల ఖర్చును అధికారులు చూపిస్తున్నారు. మిగతా రూ.39 లక్షలు ఇప్పటికీ హ్యాండ్లూమ్ శాఖ అకౌంట్ లోనే ఉన్నాయి. అయినా, ఎలాంటి పనులు చేయడం లేదు. రూ.11 లక్షలను  కూడా ఖర్చు పెట్టకుండానే పెట్టినట్లు కాకి లెక్కలు చెబుతున్నారని చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి పనులు చేయకుండానే డబ్బులు దండుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చాక..

టీఆర్ఎస్​అధికారంలోకి వచ్చాక డీకే అరుణ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు,  మంత్రి కేటీఆర్ గద్వాలలో పర్యటించారు. రూ.14 కోట్లతో పనులు చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఒక్క రూపాయి నిధులివ్వలేదు. తర్వాత ఈ విషయమై ఇన్​చార్జి మినిస్టర్ జూపల్లి కృష్ణారావును చేనేత కార్మికులు అడ్డుకోగా, 100 రోజుల్లో పనులు చేస్తామని చెప్పారు. అయినా, ఇప్పటికీ అతీగతి లేదని కార్మికులు వాపోతున్నారు.

మట్టి మాఫియా కన్ను

హ్యాండ్లూమ్ పార్క్ స్థలం వృథాగా ఉండటంతో మట్టి మాఫియా కన్ను పడింది. అడ్డూఅదుపు లేకుండా మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అనంతపురంలోని సర్వే నంబర్ 368 లో మొత్తం100 ఎకరాల సర్కారు భూమి ఉంది. 10 రోజులుగా ఇక్కడ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు.  వీరంతా స్థానిక లీడర్లే అన్న అరోపణలున్నాయి. అయినా, అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు. ఒక టిప్పర్ మట్టిని రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.

పార్క్​స్థలాన్ని కాపాడాలి

మట్టి మాఫియా అక్రమ తవ్వకాలతో హ్యాండ్లూమ్ పార్క్ స్థలం మొత్తం అన్యాక్రాంతమవుతోంది.  కలెక్టర్ స్పందించి, ఈ స్థలాన్ని కాపాడాలి. ఆఫీసర్లు చర్యలు తీసుకోకపోతే అక్కడ గుంతలు తప్ప ఏమీ ఉండదు.   -  నాగరాజు, చేనేత కార్మికుడు, గద్వాల

కాంపౌండ్ వాల్ కు ప్రపోజల్స్

పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్​కోసం రూ.2.40 కోట్లతో  ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాం. త్వరలో పనులు జరిగేలా చూస్తాం. సెక్యూరిటీ గార్డు ఉండేందుకు మట్టి మాఫియాతో ఇబ్బందులు వస్తున్నాయి. కంప్లైంట్ చేస్తాం.  గోవిందప్ప, ఏడీ, చేనేత శాఖ