ఎంపీడీవోలు, తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధం!

 ఎంపీడీవోలు, తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధం!
  • అసెంబ్లీ ఎన్నికల ముందు తహసీల్దార్లు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఎంపీడీవోల ట్రాన్స్​ఫర్
  • పూర్వ జిల్లాలకు పంపించాలని కొద్దిరోజులుగా ఒత్తిడి
  • ఉద్యోగుల రిటన్ బదిలీలకు సీతక్క, పొంగులేటి ఓకే.. సీఎం వద్దకు ఫైళ్లు 
  • త్వరలో 395 మంది ఎంపీడీవోలు, 300 మంది రెవెన్యూ అధికారులకు ఊరట

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో భారీగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. 395 మంది మండల పరిషత్ డెవలప్ మెంట్ఆఫీసర్లు (ఎంపీడీవో)లను, 300 మందికి పైగా తహసీల్దార్లు, 150 మందికి పైగా డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలకు త్వరలోనే లైన్ క్లియర్ కానున్నది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

ఏడాదిన్నరగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వారి దృష్టికి రావడంతో బదిలీలకు ఓకే చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అనుమతి కోసం ఫైళ్లు పంపించినట్లు తెలిసింది. ఈ ఫైళ్లకు సీఎం నుంచి అనుమతి వస్తే బదిలీలకు రూట్ క్లియర్ కానున్నది. ఎన్నికల సమయంలో తమను ఎన్నికల బదిలీల నుంచి మినహాయించాలని ఎంపీడీవోలు, డిప్యూటీ సీఈవోలు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డీఎల్పీవోలు, ఎంపీవోలు పంచాయతీరాజ్ శాఖ మంత్రితోపాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ చివరకు వారిని బదిలీ చేశారు. 

2023 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు 300 మంది తహసీల్దార్లను, గతేడాది ఫిబ్రవరి నెలలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 395 మంది ఎంపీడీవోలను బదిలీ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిన్నర, పార్లమెంట్ ఎన్నికలు జరిగి దాదాపు ఏడాది కావొస్తున్నా వీరిని రిటన్ బదిలీలు చేయలేదు. దీంతో తమను పాత స్థానాలకు పంపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

శాఖల మధ్య కోఆర్డినేషన్ లేక జాప్యం

ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను (ఎంసీసీ) దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా ఒకేచోట మూడేండ్ల ఉద్యోగ కాలం పూర్తి చేసుకున్న వారు, సొంత జిల్లాల్లో పనిచేస్తున్న మండల పరిషత్ డెవలప్ మెంట్ఆఫీసర్(ఎంపీడీవో)లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో వారు తమను పూర్వ జిల్లాలకు పంపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. . అయితే, జిల్లాల్లో ఇంటర్నల్ బదిలీలు కలెక్టర్లు చేసే అవకాశం ఉంటుంది. అంతర్ జిల్లాల బదిలీ విషయంలో ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉండటం.. దీనికితోడు తహసీల్దార్లు తమను ఎలాంటి నిబంధనలు లేకుండా పాత స్థానాలకు పంపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం బదిలీల ప్రక్రియ జాప్యానికి కారణమైందని సమాచారం. 

మంత్రుల చొరవతో ముందడుగు

తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీవోలు పూర్వ జిల్లాలకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పలుమార్లు మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. సాధారణంగా ఎన్నికల సమయంలో బదిలీలు చేయడం.. ఆ తర్వాత వారిని పూర్వ జిల్లాలకు పంపిస్తుంటారు. ఎన్నికలు గడిచి ఏడాది కావొస్తున్నా.. బదిలీలు చేయకపోవడంతో తాము పడుతున్న ఇబ్బందులు పడుతున్నామని మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు సెక్రటేరియట్ లో ప్రత్యేకంగా భేటీ అయి రెండు డిపార్ట్ మెంట్లలో ఎంతమందిని ఎన్నికల సమయంలో బదిలీ చేశారో.. ఆ శాఖల నుంచి వివరాలు తెప్పించుకుని పరిశీలించారు. బదిలీల చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సీఎం నుంచి గ్రీన్​సిగ్నల్ వస్తే దాదాపు రెండు శాఖల్లోని 700 మంది పైచిలుకు ఉద్యోగులకు ఊరట లభించనున్నది.