
- 10 టీఎంసీల నీళ్లు దిగువకు..
- తాజాగా అన్నారం నుంచి నీటి విడుదల
- ఇక రెస్ట్‌లోనే కాళేశ్వరం పంపులు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కుంగిన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల కోసం గేట్లు ఖుల్లా పెట్టడంతో రిజర్వాయర్ ఖాళీ అయింది. గత నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్ కుంగిపోవడంతో అలర్టయిన ఇంజినీర్లు హుటాహుటిన 61 గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు. ఆ గేట్లన్నీ అలాగే ఓపెన్‌చేసి పెట్టడంతో ప్రాణహిత నది ఇన్‌ఫ్లో కూడా వృథాగా వెళ్లిపోతోంది.
దెబ్బతిన్న బ్యారేజీ పిల్లర్స్ రిపేర్ అయ్యేంత వరకు మేడిగడ్డలో నీటిని నిల్వ చేసే పరిస్థితి ఉండదని, అప్పటిదాకా కాళేశ్వరం మోటార్లు రెస్ట్‌లో ఉండాల్సిందేనని ఇంజినీర్లు చెప్తున్నారు. రిపేర్లకు సుమారు 6 నెలలకుపైగా టైం పట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అన్నారం(సరస్వతి) బ్యారేజీ పియర్స్ కింద కూడా సీపేజ్‌లు ఏర్పడడంతో ఒక గేట్‌ను ఎత్తగా ఆ నీరు కూడా దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీలోకి వస్తోంది.
అన్నారం బ్యారేజీ బుంగలను పూడ్చడానికి బ్యారేజీలో ఉన్న నీటినంతా కిందికి విడుదల చేయాల్సి ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే రాబోయే వేసవిలో కూడా కాళేశ్వరం వాటర్ లిఫ్టింగ్ జరగకపోవచ్చని ఎక్స్‌పర్ట్‌లు అంచనా వేస్తున్నారు.
రోజురోజుకూ మరింత కుంగుతున్న పిల్లర్లు..
‘15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడా ఉక్కు.. గిజా పిరమిడ్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా మట్టి తవ్వకాలు.. ఏడు బుర్జు ఖలీఫాలకు సరిపడా కాంక్రీట్.. 72 గంటల్లో 25,580 క్యుబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ తో ప్రపంచ రికార్డు. ఇదీ మేడిగడ్డ బ్యారేజీ చరిత్ర’ ఇదీ నిన్నమొన్నటిదాకా ఇరిగేషన్ శాఖ, సర్కారు చేసిన ప్రచారం. కానీ ఇప్పుడంతా తలకిందులైంది. మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ భూమిలోకి కుంగిపోవడంతో కాళేశ్వరం అప్రతిష్ట మూటకట్టుకుంది. అక్టోబర్ 21న బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్ కుంగిపోవడంతో అటు, ఇటు మరో ఆరు పిల్లర్స్ కూడా దెబ్బతిన్నాయి.
ఈ పిల్లర్లన్నీ రోజురోజుకూ మరింత లోపలికి దిగబడుతున్నాయి. ఇప్పటికే ఐదు ఫీట్లకు పైగా భూమిలోకి కుంగిపోయాయి. దీంతో వంతెనపై భాగంలో ఉన్న ఐరన్ రాడ్‌ల మధ్య ఖాళీలు ఏర్పడి వంగిపోయాయి. బ్యారేజీపై ఏర్పాటు చేసిన రోడ్డు 50 మీటర్ల పొడవునా 5 ఫీట్ల మేర కుంగిపోయింది. నది అడుగు భాగంలో క్రాక్‌లు పెరుగుతున్నాయి.
కొనసాగుతున్న పోలీసుల పహారా..
మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 13 రోజులుగా పోలీస్ పహారా కొనసాగుతోంది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఆదేశాల ప్రకారం బ్యారేజీ దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. బ్యారేజీ వద్దకు కొంతమంది ముఖ్య నేతలను తప్ప ఎవ్వరినీ అనుమతించడం లేదు. మూడు చోట్ల బారికేడ్లు పెట్టి సెక్యూరిటీ ఉంటున్నారు. మీడియాను రానివ్వట్లేదు. ఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్న ఇంజినీర్లు కాంట్రాక్ట్ సంస్థే రిపేర్లు చేస్తుందని చెబుతున్నరు. కానీ, ఎప్పటిలోగా రిపేర్లు పూర్తిచేస్తారనే విషయాన్ని వెల్లడించడం లేదు.
రెస్ట్‌లోనే కాళేశ్వరం పంపులు..
గతేడాది జూలై 13న వచ్చిన వరదలకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన లక్ష్మి(కన్నెపల్లి), సరస్వతి(అన్నారం) పంప్‌హౌజ్‌లు నీటమునిగాయి. మోటార్లన్నీ ఖరాబ య్యాయి. లక్ష్మి పంప్‌హౌజ్‌లో సేఫ్టీవాల్ కూలి మోటార్లపై పడడంతో 6 మోటార్లు తుక్కు కింద మారాయి. దీంతో సుమారు 6 నెలలు లిఫ్టింగ్ ఆపేశారు. ఇప్పటికీ ఈ పంప్‌హౌజ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సమస్య రావడంతో మరోసారి కాళేశ్వరం మోటార్లకు రెస్ట్ దొరికినట్లయ్యింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేసేందుకు 6 నెలలకు పైగా పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వచ్చే వేసవిలోనూ కాళేశ్వరం ఎత్తిపోతలపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఇంజినీర్లు చెప్తున్నారు.
అన్నారం బ్యారేజీని పరిశీలించిన సేఫ్టీ బృందం
మహదేవపూర్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం (సరస్వతి) బ్యారేజీలో బుంగలు పడిన ప్రాంతాన్ని కేంద్ర, రాష్ట్ర నిపుణుల బృందం గురువారం 2 గంటల పాటు పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ టీమ్‌కు చెందిన దేవేందర్‌రావు ఆధ్వర్యంలో బ్యారేజీ మెయింటనెన్స్ కోసం ఏర్పాటు చేసిన వాక్ వే బ్రిడ్జిపై నడుస్తూ డౌట్ వచ్చిన ప్రతీ పిల్లర్ దగ్గర పరీక్షించారు.
ALSO READ : ఈ నగరానికి ఏమైంది..? గ్రేటర్ హైదరాబాద్ లో ఏటేటా పెరిగిపోతున్న కాలుష్యం
ఒకటో పియర్ నుంచి 66వ పియర్ వరకు బ్యారేజీ వాక్ వే నుంచి 1.7 కిలోమీటర్లు నడిచారు. బుధవారం పత్రికల్లో అన్నారం బ్యారేజీకి బుంగలు వచ్చాయని కథనాలు రాగా, వాటి గురించి ఆరా తీశారు. దీనికి ఈఎంసీ వెంకటేశ్వర్లు, ఈఈ యాదగిరి సమాధానాలిచ్చారు. గతంలో కూడా ఇలానే బుంగలు ఏర్పడ్డాయని, ఓఅండ్ఎం ద్వారా రిపేర్లు చేశామన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, స్టేట్ డ్యాం సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ , ఆపరేషన్, మెయింటనెన్స్ కు చెందిన 12 మంది ఇందులో ఉన్నారు.