
- అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తది
- కంచ గచ్చిబౌలి మార్ఫింగ్ ఫొటో వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీట్
- పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ
హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. ఈ భూములకు సంబంధించి మార్ఫింగ్ ఫొటోను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో షేర్ చేయడంపై పోలీసులు నోటీసులు ఇవ్వగా, వాటికి ఆమె శనివారం వివరణ ఇచ్చారు. అయితే ఆ వెంటనే ‘ఎక్స్’లో మరో పోస్టు పెట్టారు. ‘‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు పూర్తిగా సహకరించాను. కానీ ఆ ఫొటోను నాతో పాటు 2 వేల మంది రీపోస్ట్ చేశారు. మరి వారందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా? ఒకవేళ అలా చేయకపోతే ఈ వ్యవహారంలో కొందరిని మాత్రమే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. చట్టం ముందు సమానత్వాన్ని ఉల్లంఘించినట్లే” అని అందులో పేర్కొన్నారు. అలాగే ఆ ట్వీట్‌కు #RuleOfLaw, #FreedomOfSpeech, #NaturalJustice, #JustSaying హ్యాష్‌ట్యాగ్‌లను జోడించారు.
ఇది ఐదో ట్వీట్..
మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ‘ఎక్స్’ హ్యాండిల్‌లో పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను స్మితా సబర్వాల్ రీట్వీట్చేశారు. అది కంచ గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ల ముందు నెమళ్లు, జింకలు ఉన్నట్లుగా సృష్టించిన మార్ఫింగ్ ఫొటో. ఈ ఇష్యూలో పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించగానే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి సహా పలువురు తమ సోషల్‌మీడియా అకౌంట్ల నుంచి ఆ మార్ఫింగ్ ఫొటోను తొలగించారు. కానీ స్మితా సబర్వాల్ మాత్రం తొలగించలేదు.
దీంతో ఈ నెల12న గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. నిజానికి నోటీసులు జారీ అయ్యాక స్మితా సబర్వాల్ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెడ్తారని అంతా భావించారు. కానీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఈ నెల 17న ఆమె మరో మూడు రీట్వీట్లు చేశారు. ‘తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్అధికారికే నోటీసులిస్తారా? ఇది దేనికి సంకేతం?’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టులతో పాటు ‘కంచగచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం తొలగించిన 100 ఎకరాలను పునరుద్ధరించాలి’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఉన్న ‘లైవ్‌లా’ పోస్టును షేర్ చేశారు. ఇప్పుడు తాజాగా తనలాగా మార్ఫింగ్ ఫొటోను షేర్ చేసిన 2 వేల మందిపైనా చర్యలు తీసుకుంటారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశారు. దీంతో స్మితా సబర్వాల్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.