కొత్తగూడెంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలి: కలెక్టర్ అనుదీప్

కొత్తగూడెంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలి: కలెక్టర్ అనుదీప్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం టౌన్​లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్​ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్​చైర్ పర్సన్, కౌన్సిలర్లు, కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం కలెక్టరేట్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. రెండు, మూడు నెలల్లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక నిధులు రావొచ్చని, కొత్తగూడెం మున్సిపాలిటీ అమృత్ స్కీంలో చేరే అవకాశం ఉందన్నారు. ఈ స్కీం కింద దాదాపు రూ.120 కోట్లు రావొచ్చని చెప్పారు. మిషన్ భగీరథ కింద ఇప్పుడిస్తున్న దానికంటే రెట్టింపు స్థాయిలో నీళ్లను తీసుకునే విధంగా ప్లాన్​చేయాలని సూచించారు. 

ALSO READ: వందల ఫోన్స్.. మెంటల్ టార్చర్.. డ్రగ్స్ కేసుపై స్పందించిన ఆషు రెడ్డి

సింగరేణి నీటిని కూడా వాడుకునేలా ప్రణాళికలు ఉండాలన్నారు. నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వార్డుల్లో ఎందుకు తిరగడం లేదని ఆఫీసర్లపై కలెక్టర్​ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లా కనెక్షన్లు, ఇతర వివరాలు పూర్తి స్థాయిలో అధికారుల వద్ద లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్​లో మున్సిపల్​చైర్ పర్సన్ కె.సీతాలక్ష్మి, కమిషనర్ రఘు పాల్గొన్నారు. అనంతరం నీటి ఎద్దడిని నివారించాలని కోరుతూ సీపీఐ కౌన్సిలర్లు కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చారు. అలాగే కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో అనుదీప్​పాల్గొని వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు వచ్చినవారితో కలెక్టరేట్ కిటకిటలాడింది. ఎర్రగుంట పీహెచ్​సీలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న తేజావత్ సుశీల ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సోమవారం ఆమె కలెక్టర్​ను కలవగా అధికారులతో కలిసి
 సన్మానించారు.