
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సంతాప తీర్మానాలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ చదివి వినిపంచారు. అనంతరం మృతి చెందిన సభ్యులకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. తర్వాత ఇటీవల జరిగిన కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో విజయం సాధించిన దాసరి సుధతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది.
బీఏసీ సమావేశానికి హాజరైన జగన్
ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజుకే పరిమితం చేయకుండా పొడిగించాలని బీఏసీ సమావేశంలో టీడీపీ పక్ష నాయకుడు అచ్చెన్నాయుడు కోరగా.. పలు బిల్లులకు ఆమోదం తీసుకోవాల్సి ఉండడంతో ప్రభుత్వం కూడా అంగీకరించింది. దీంతో ఆరు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.