ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ

  • జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి -సీఎం జగన్
  • కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని వినతి

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం మరోలేఖ రాశారు. కృష్ణా జలాల వివాదంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా వాడుకుంటోందని.. ఈ విషయంపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు, కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. 
ఉమ్మడి ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటినంతా తెలంగాణ రాష్ట్రం అక్రమంగా వాడేస్తోందని.. విద్యుత్ ఉత్పత్తి వల్ల విలువైన నీరంతా వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి వస్తోందని జగన్ ఆరోపించారు. ఉమ్మడి ప్రాజెక్టులపై కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ యంత్రాంగాలున్నా.. తెలంగాణ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని జగన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తుండడం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు.
శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని, దీని వల్ల పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏపీ ప్రభుత్వం 834 అడుగులకు దిగువన నీటిని వాడుకోలేదని తెలిసే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాయలసీమ కాలువలకు నీళ్లు వాడుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జూన్ 1 నుంచి 26 టీఎంసీల నీరు శ్రీశైలం డ్యాం కు వస్తే.. అందులో 19 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేశారని.. కేఆర్‌ఎంబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని, దీని వల్ల కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతానికి ఇబ్బంది కలుగుతుందని ఏపీ సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రాజెక్టులను సీఐఎస్‌ఎఫ్‌ బలగాల పరిధిలోకి తీసుకురావాలని జగన్ కోరారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా... కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీని లేఖలో కోరారు.