- మత్స్యకారులు, చెంచులకు తీరని అన్యాయం
- పట్టించుకోని ఆఫీసర్లు, ప్రమాదంలో అభయారణ్యం
నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణా తీర ప్రాంత గ్రామాలను అడ్డాగా మార్చుకొని ఏపీ జాలర్లు సాంప్రదాయ చేపల వృత్తిపై ఆధారపడిన చెంచులకు అన్యాయం చేస్తున్నారు. చెంచులతో పాటు చేపల వేటపై ఆధారపడిన మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నారు. కృష్ణా నదిలో నిషేధిత అలవి వలలతో నదిలో చేపలు పడుతున్నా సంబంధిత శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి.
నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలోనే కృష్ణా నది ప్రవహిస్తోంది. ఇక్కడ పులులతో పాటు పలు రకాల వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. అటవీశాఖ అనుమతి లేకుండా ఏటీఆర్లోకి కాలు పెట్టే అవకాశం లేకపోయినా, దాని పరిధిలోకి వచ్చే కృష్ణాతీర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో అక్రమ క్యాంపులు వెలుస్తున్నాయి. ఒక్కో క్యాంపులో 30 మంది నివసిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా మరబోట్లలో కృష్ణా నదిలో అలవి వలలు వినియోగిస్తున్నారు. కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలకేంద్రాల్లో మకాం వేసిన దళారులు ఇతర రాష్ట్రాల నుంచి జాలర్లు, కూలీలను రప్పించి చేపల వేట కొనసాగిస్తున్నారు. దీంతో సాంప్రదాయ చేపల వేటపై ఆధారపడి జీవించే చెంచులు వీరితో పోటీ పడలేకపోతున్నారు.
కృష్ణా తీరం సురక్షితమేనా?
కృష్ణానదికి ఇరువైపులా విస్తరించిన నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తీరంలో పులులు, వన్యప్రాణులు ఆవాసాలు ఉన్నాయి. ఎండాకాలంలో నీటి కోసం అన్ని రకాల జంతువులు కృష్ణా నది తీర ప్రాంతాలకు చేరుకుంటాయి. ఇటువంటి ప్రాంతం ఏపీ జాలర్ల అక్రమ అడ్డాగా మారిపోయింది. స్థానిక మత్య్స కారులు, చెంచులు నదిలో చేపలు పట్టేందుకు ఫారెస్ట్, మత్స్య, రెవెన్యూ శాఖలఆఫీసర్లు అనుమతి ఇవ్వడం లేదు. అయితే అటవీ జంతువులు సంచరించే ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని, ఏపీ జాలర్లు, కూలీలతో దందా చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అమరిగిరి, సోమశిల, మల్లేశ్వర ప్రాంత మత్య్యకారులు, చెంచులు చెబుతున్నారు. కృష్ణానది ఒడ్డున క్యాంపులు వేసుకొని ఉంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
చేస్తున్నారు.
ఏపీ జాలర్ల కబ్జాలోకి..
కొల్లాపూర్ మండలం అమరగిరి గ్రామం అద్భుతమైన పర్యాటక ప్రాంతం. కృష్ణా బ్యాక్ వాటర్ మధ్య సహజంగా ఏర్పడిన చిన్న చిన్న దీవులు, చరియలు ఇక్కడి చెంచులకు జీవనోపాధి కల్పిస్తాయి. నల్లమల అభయారణ్యంలోని జంతువులకు భద్రమైన ఆవాస ప్రాంతం కూడా. అలాగే సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం ప్రాంతాలు టూరిజం స్పాట్లుగా అభివృద్ది చెందుతున్నాయి. ఇక్కడి వారికి చేపల వేట ప్రధాన జీవన ఆధారం. అయితే కృష్ణా నది మధ్యలో ఉండే చీమలతిప్ప, అంకాలమ్మకోట వంటి ఐలాండ్స్ కూడా ఏపీ జాలర్ల కబ్జాలోకి వెళ్లిపోయాయి.
Also Read :- తాగునీటి తిప్పలకు చెక్..
అంకాలమ్మ కోట ప్రాంతం ఏపీ ప్రాంతం పరిధిలోకి వెళ్లినా చీమలతిప్ప తెలంగాణ ప్రాంతంలోకి వస్తుంది. నదిలో అక్రమ పడవ ప్రయాణాలు, చేపల వేట, జంతువులను వేటాడి నది దాటకుండా అడ్డుకునేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నదిలో రివర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుంది. పర్యాటకశాఖకు చెందిన లాంచీలు, బోట్లు సైతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా నడిపించే అవకాశం ఉండదు. అలాంటి ప్రాంతాన్ని కబ్జా చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
స్థానికులకు అన్యాయం..
స్థానిన మత్స్యకారులు, చెంచులు సాంప్రదాయ చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఇక్కడి చేపలను నిషేధిత అలివి వలలతో పట్టుకొని తరలిస్తూ కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీ జాలర్లతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. లోకల్ దళారులు మహారాష్ట్ర, బిహార్, ఒరిస్సా, ఏపీలకు చెందిన జాలర్లు, కూలీలను రప్పించి కృష్ణా నది తీరం వెంట క్యాంపులు ఏర్పాటు చేసి చేపలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ఇక్కడే పుట్టి పెరిగిన తమకు అడవిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వని ఆఫీసర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా తీర ప్రాంతంలోని వందలాది క్యాంపులను ఎత్తివేసి, స్థానికేతరులకు అండగా ఉంటున్న దళారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని స్థానిక మత్స్యకారులు, చెంచులు కోరుతున్నారు.