- RDSను బోర్డు పరిధిలోకి తీసుకురండి: KRMBకి తెలంగాణ ప్రభుత్వం లేఖ
హైదరాబాద్: తుంగభద్ర నదిపై ఉన్న రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఆధునీకరణ పనులు జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటకను అడ్డుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. వెంటనే ఆర్డీఎస్ ప్రాజెక్టును కూడా బోర్డు పరిధిలోకి తీసుకువచ్చి ఆధునీకరణ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి మరోసారి లేఖ రాసింది. ప్రభుత్వం తరపున తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కేఆర్ఎబీ చైర్మన్ కు లేఖ రాశారు.
ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ జరగకపోవడం వల్ల మూడో వంతు నీరు రావడంలేదని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి సుమారు 15 ఏళ్లుగా ఆర్డీఎస్ ఆధునీకరణ చేపట్టకుండా అడ్డుకుంటున్న ఏపీ ప్రభుత్వం.. ఆర్డీఎస్ కు దిగువన ఉన్న కేసీ కెనాల్ ద్వారా అదనపు నీటిని మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఫిర్యాదు చేశారు.
ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ పూర్తయితేనే పూర్తి స్థాయిలో నీరు వచ్చే పరిస్థితి ఉన్నందున బోర్డు చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్డీఎస్ ను వెంటనే బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి ఆధునీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కేఆర్ఎంబీ చైర్మన్ కు విజ్ఘప్తి చేశారు.