- రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు
- నిజానిజాలు నిగ్గు తేల్చాలని ప్రధాని మోదీకి జగన్ లేఖ
- ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
హైదరాబాద్, వెలుగు: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సిట్ రిపోర్ట్ వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అమరావతిలో ఆదివారం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. మాజీ సీఎం జగన్ చేసిన పాపాలు ప్రజలకు ముందే తెలిసి ఉంటే, వైసీపీకి 11 సీట్లు కూడా వచ్చేవి కావని అన్నారు. తప్పు చేయడమే కాకుండా, దాన్ని సమర్థించుకుంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారని మండిపడ్డారు. ఆ లేఖలో అన్ని అబద్ధాలే చెప్పారని, జగన్‌ను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని పేర్కొన్నారు.
టీటీడీని మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. ఈ నెల 23 నుంచి మహా శాంతియాగం నిర్వహిస్తాం. ఆ తర్వాత పంచగవ్య సంప్రోక్షణ చేస్తాం” అని చంద్రబాబు తెలిపారు. కాగా, కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఈ వివాదంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని భావిస్తున్నది.
వైసీపీ ఆఫీస్ పై దాడికి యత్నం..
తిరుమల లడ్డూ వివాదంపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరుతూ ప్రధాని మోదీకి మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ లేఖ రాశారు. ‘‘శ్రీవారి లడ్డూ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు. లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారంటూ ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. సున్నితమైన ఈ అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి” అని అందులో కోరారు. కాగా, బీజేవైఎం కార్యకర్తలు ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. రాళ్లు, రంగు డబ్బాలు పార్టీ ఆఫీసులోకి విసిరేశారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పవన్‌తో ఈవో భేటీ..
తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో క్షమించమని స్వామి వారిని వేడుకుంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆదివారం గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు. 11 రోజులు దీక్ష కొనసాగించి, తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీక్ష చేపట్టిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీవారి లడ్డూను కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, పంది కొవ్వు, చేప నూనె ఉన్నట్టు రిపోర్టులో తేలింది.
వైసీపీ హయాంలో ఇలాంటి నెయ్యితో తయారు చేసిన లక్ష లడ్డూలను టీటీడీ నుంచి అయోధ్య ఆలయానికి పంపించి చాలా పెద్ద తప్పు చేశారు. దీన్ని ప్రతి హిందువు, ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి ఖండించి పోరాడాల్సిన అవసరం ఉంది” అని పవన్ అన్నారు. కాగా, పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. ఈ సందరర్భంగా నెయ్యి కల్తీ వివరాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈవోను ఆదేశించారు.