అపార్ ఆలస్యం .. ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్లోగా ప్రక్రియ

అపార్ ఆలస్యం .. ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్లోగా ప్రక్రియ

 

  • విద్యార్థులు, తల్లితండ్రుల పేర్లలో తప్పులు 
  • రేపటితో ముగియనున్న గడువు 
  • 30 శాతం కూడా దాటని ఆన్ లైన్ ప్రక్రియ

నల్గొండ, వెలుగు: విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రకటించిన   ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) రిజిస్ట్రేషన్​ కు ఉమ్మడి జిల్లాలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈనెల 31వరకు  విద్యార్థుల వివరాల నమోదు పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటి పరకు ఉమ్మడి జిల్లాలో 30 శాతం కూడా పూర్తి కాలేదు.  విద్యార్థి పుట్టిన తేదీ, పేరు, తల్లిదండ్రుల పేర్లలో తప్పులు, స్కూల్​ రికార్డులతో  మ్యాచ్​ కాకపోవడంతో అపార్​ రిజిస్ట్రేషన్​ కావడం లేదు.  

వన్‌‌ నేషన్‌‌వన్‌‌ స్టూడెంట్‌‌ఐడీలో భాగంగా..

జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా  కేంద్రప్రభుత్వం ప్రారంభించిన వన్‌‌ నేషన్‌‌వన్‌‌ స్టూడెంట్‌‌ఐడీ కార్యక్రమం ఇది. అపార్‌‌ ఐడీ ద్వారా  విద్యార్థి అకాడమిక్​ రికార్డులు ఆన్​లైన్​లో ప్రత్యేకంగా రికార్డు అయి ఉంటాయి.  విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ కావాలన్నా, ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవాలన్నా  ఈ  ఐడీని  ఉపయోగించుకోవచ్చు.   ఉన్నత చదువులకు, ఉద్యోగ దరఖాస్తులకు సైతం ఇది అందించాల్సి ఉంటుంది.  ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థు లందరికీ అపార్‌‌ ఐడీని క్రియేట్​ చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  చాలా మంది విద్యార్థుల  స్కూల్​ రికార్డులతో   ఆధార్‌‌ సమాచారం మ్యాచ్​ కావడం లేదు.  దీంతో సకాలంలో అపార్‌‌ నమోదు చేయలేకపోతున్నారు.  

తప్పని ఇబ్బందులు..

జిల్లా వ్యాప్తంగా అపార్‌‌లో పేరు మార్పులు ఇతర అక్షరదోషాలు, తదితర సాంకేతిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అధికారులు, సిబ్బంది సాంకేతిక సమస్యలపై సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు. జనన ధ్రువీకరణ పత్రం, ఇతర బోనఫైడ్‌‌ సమస్యలను అధిగమించినట్లయితే పూర్తిస్థాయి లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 30శాతం కూడా దాటలే 

అపార్ నమోదు కు మరొక్క రోజు మాత్రమే గడువు ఉండగా నేటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30 శాతం   కూడా నమోదవలేదు. నల్గొండ జిల్లాలో 1727 ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో 2,46,711 మంది స్టూడెంట్స్ ఉండగా ఇప్పటి వరకు 51,290 మంది స్టూడెంట్స్ వివరాలు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లాలో 1191 స్కూల్స్ ఉన్నారు.  ఇందులో..  1,44,816 మంది స్టూడెంట్స్ ఉండగా 39,417 మంది స్టూడెంట్స్ వివరాలు నమోదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 873 స్కూల్స్ లో  1,14,454మంది స్టూడెంట్స్ ఉండగా 32,161 స్టూడెంట్స్ వివరాలను నమోదు చేశారు.

ఆధార్ లో తప్పులతో ఆలస్యం 

ఆధార్ లో తప్పులు ఉండడంతో అపార్ లో విద్యార్దుల వివరాలను నమోదు చేయడానికి ఆలస్యం అవుతుంది. వాటిని అధిగమించి నమోదు పూర్తి చేస్తాం. నిర్ణీత గడువు లోపు పూర్తి అయ్యేలా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. 
- అశోక్, డీఈఓ, సూర్యాపేట జిల్లా