ఐఫోన్ యూజర్‎లారా జాగ్రత్త: యువకుడి జేబులోనే పేలిన ఐఫోన్ 13

ఐఫోన్ యూజర్‎లారా జాగ్రత్త: యువకుడి జేబులోనే పేలిన ఐఫోన్ 13

లక్నో: ఐఫోన్ అంటేనే బ్రాండ్, సేఫ్టీ, సెక్యూరిటీకి ఫేమస్. అందుకే ఐఫోన్ అంత ఖరీదు ఉంటుంది మరీ. అంత ధర ఉన్నప్పటికీ ఆ ఫీచర్స్, సెక్యూరిటీ కోసం చాలా మంది ఐఫోన్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల కూడా వ్యక్తిగత భద్రతలో భాగంగా ఐఫోన్లు యూజ్ చేస్తుంటారు. అయితే.. తాజాగా ఐఫోన్ యూజర్లు షాక్ అయ్యే ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. వేలకు వేల పెట్టి కొన్న ఐఫోన్ కూడా సాధారణ ఫోన్ల మాదిరిగా ఓ వ్యక్తి జేబులోనే పేలింది. 

దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. అలీఘర్ జిల్లాలోని ఛరా పోలీస్ స్టేషన్ పరిధి శివపురిలో ఓ వ్యక్తి ఇటీవల ఎంతో ఇష్టంతో ఐఫోన్ 13 కొనుగోలు చేశాడు. కానీ ఈ సంతోషం అతడికి ఎన్నో రోజులు నిలవకపోవడమే కాకుండా గాయపడేలా చేసింది. ఎందుకంటే.. ఊహించని రీతిలో అతడి జేబులోనే ఐఫోన్ పేలింది. జేబులో ఒక్కసారిగా ఫోన్ పేలడంతో అతడి శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. 

పేలుడు తర్వాత ఐఫోన్ తీవ్రంగా కాలిపోయి దెబ్బతిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. దీనిపై నెటిజన్లు, ఐఫోన్ వినియోగదారులు రియాక్ట్ అవుతున్నారు. ఐఫోన్ భద్రతాపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు.. అలీఘర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐఫోన్ పేలడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి నిపుణుల సహాయం తీసుకుంటున్నారు.