
- నిందితుల్లో సైబరాబాద్ సీపీ ఎస్కార్ట్ ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్
చేవెళ్ల, వెలుగు: ఈజీ మనీ కోసం ఓ ఏఆర్ కానిస్టేబుల్, మరో ఇద్దరితో కలిసి హవాలా డబ్బు పేరుతో కర్నాటకకు చెందిన వ్యక్తుల వద్ద రూ. 25 లక్షలు కొట్టేశారు. మొయినాబాద్ సీఐ పవన్ కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. యూపీకి చెందిన అజయ్ హైదరాబాద్‌లో స్క్రాప్ బిజినెస్ చేస్తుంటాడు. సిటీకి చెందిన మొబిన్ తండ్రి నబీ గతంలో మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గూడలో ఫామ్ హౌస్ ఓనర్ జుబేర్ వద్ద డ్రైవర్ గా చేసి మానేశాడు. అతనికి అజయ్‌తో పరిచయం ఉంది. ఇద్దరూ ఈజీగా మనీకి ప్లాన్ చేశారు. గుల్బార్గాలో స్క్రాప్ బిజినెస్ చేసే ఇమ్రాన్‌కు, హైదరాబాద్‌లో స్క్రాప్ వ్యాపారి ఉమర్‌కు గత బుధవారం కాల్చేశారు.
ఫామ్ హౌస్‌లో షెడ్డు కూల్చి వేస్తున్నారని, స్క్రాప్ డంప్ చాలా ఉందని, కొంటే భారీ లాభం వస్తుందని చెప్పారు. రూ.25 లక్షలు తీసుకుని రావాలని నమ్మించారు. మరో ఇద్దరు గ్రామస్తులైన రాంచందర్, మసూద్, బంధువైన ఇమ్రాన్‌తో పాటు సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సీపీ ఎస్కార్ట్ శేఖర్ సాయం అడిగారు. ఇద్దరూ ఫాంహౌస్‌లోకి రాగానే హవాలా డబ్బులు అంటూ లాక్కొని పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్ దోపిడీలో ఉన్నాడని తేలడంతో అతడితో పాటు రాంచందర్‌ను, మసూద్‌ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.