విశ్లేషణ: లోకల్​ వాళ్లే.. నాన్​ లోకలా?

ఆరు సూత్రాల పథకం అమలైతలేదని, 610 జీవోను ఆంధ్ర పాలకులు తొక్కిపెడుతున్నరని, ఇక్కడి ఉద్యోగాలు మనకి దక్కాలనే.. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. రాష్ట్రం వస్తే కొలువులొస్తయని విద్యార్థులు, నిరుద్యోగులు, జాబ్స్​అన్నీ ఆంధ్ర పాలకుల పాలవుతున్నాయని ఉద్యోగులు సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ కోసం కొట్లాడిన్రు. ఎంతో మంది ఆత్మబలిదానాలు, త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. కానీ సొంత రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగుల విభజన తీరు దారుణంగా ఉంది. సీనియర్, జూనియర్ పేరుతో ప్రభుత్వం స్థానికుడిని స్థానికేతరుడిగా పక్క జిల్లాలకు బదిలీపై పంపి, మానసిక క్షోభకు గురి చేస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాలు.. మావి మాకే దక్కాలనే నినాదంతో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. చిన్నా.. పెద్దా.. తేడా లేకుండా.. సకల జనులు రోడ్డెక్కి పోరాటం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు చదువులు పక్కకు పెట్టి ఉద్యమానికి ఊపిరిలూదారు. ఉద్యమ పోరాటంలో పన్నెండు వందల మంది ప్రాణాలర్పించారు. వందలాది తెలంగాణ బిడ్డలు లాఠీ దెబ్బలకు, తూటాలకు ఎదురొడ్డి పోరాడారు. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో.. సదువుకున్న బిడ్డలకు కొలువులు రాకపాయే. కొలువులు చేస్తున్న వారు మానసిక క్షోభ అనుభవించే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఉద్యోగుల విభజనలో స్థానికత అంశాన్ని పక్కనబెట్టి, సీనియర్, జూనియర్ అనే కొత్త విధానాన్ని తెరమీదకు తెచ్చింది. ఉద్యోగులను ఉన్న ఊరును విడిచి పొమ్మంటోంది. 
 

రిటైర్మెంట్ ఏజ్ ఎందుకు పెంచినట్టు?

వయసు యాభై దాటిందంటేనే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతుంటాయి. 50 ఏండ్లు ​దాటిన చాలా మంది ఉద్యోగులు సహజంగానే శారీరక, మానసిక ప్రశాంతతను కోరుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకుల ప్రయోజనాల కోసం, కొన్ని వర్గాల ఉద్యోగ ఆర్థిక ప్రయోజనాల కోసం.. ఎవరూ అడగకపోయినా.. రిటైర్మెంట్ ఏజ్​ను 58 ఏండ్ల నుంచి 61 ఏండ్ల వరకూ పెంచింది. దీంతో ఎన్నో ఏండ్లగా కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నిరాశే మిగిలింది. పోస్టులు ఖాళీ కాక, ఖాళీ అయినా.. రిక్రూట్​మెంట్​లేక ఎంతో మంది నిరుద్యోగులు ఏండ్ల కొద్దీ పోటీ పరీక్షలకు ప్రిపేరై.. మానసిక క్షోభతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గడిచిన కొన్ని నెలల్లో పదుల సంఖ్యలో నిరుద్యోగులు నోట్​రాసి మరీ ప్రాణాలు తీసుకుంటుంటే.. ప్రభుత్వం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ను కూడా వేయడం లేదు. పైగా ఎవరూ అడగని రిటైర్మెంట్ ఏజ్ పెంచి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ఏజ్ ​పెంపు ఉద్యోగుల విభజన ప్రక్రియ సందర్భంగా జూనియర్ ఉద్యోగులకు కూడా ఇబ్బంది కరంగా మారింది. 
 

317 జీవో పూర్తి అసంబద్ధం

మొన్నటికి మొన్న ఆగమేఘాల మీద,  ఎవరినీ సంప్రదించకుండా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం 317 జీవో రిలీజ్​చేసింది. కాగా ఈ జీవో ఉద్యోగుల పాలిట శాపంలా మారింది. 317 జీవో ప్రకారం.. స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా జూనియర్, సీనియర్​ ఉద్యోగులని పేర్కొంటూ.. పుట్టిన ఊరును, సదివిన నేలను కాదని బలవంతంగా పక్క జిల్లాలకు, పక్క జోన్లకు పంపుతున్నారు. ఈ చర్య ఉద్యోగుల మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తోంది. లోకల్‌‌ వాళ్లను కాదని, సీనియర్, జూనియర్ పేరుతో విభజన ప్రక్రియను చేపడుతుండటం వల్ల.. సీనియర్లంతా ఒక జిల్లాకు, జూనియర్లు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల ఆయా జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అన్ని జిల్లాలకు సీనియర్లు, జూనియర్లను సమ ప్రాతిపదికన కేటాయిస్తేనే న్యాయం జరుగుతుంది. 
 

స్పౌజ్ ఉద్యోగుల సంగతేంటి?

ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలు ఒక దగ్గర ఉద్యోగం చేస్తేనే బాగుంటుందని సీఎం కేసీఆర్​అనేక సందర్భాల్లో  చెప్పారు. వారి కుటుంబం సంతోషంగా ఉండటంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, ఇదే రాష్ట్ర ప్రభుత్వ అభిమతంగా అనేక సార్లు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల విభజన ప్రక్రియలో భార్యా భర్తలు ఒకే చోట పని చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీనివల్ల చాలా మంది ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రస్తుత విభజన ప్రక్రియలో భార్యా భర్తలైన ఉద్యోగులకు సరైన ప్రాధాన్యతనివ్వాలి. వారికి ఒకే ప్రాంతంలో పని చేసే అవకాశం కల్పించాలి. 
 

కేటాయింపులో గందరగోళం..

స్థానిక అంశాలను, అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా, గుర్తించకుండా రాష్ట్ర స్థాయిలోనే ఉద్యోగుల కేటాయింపు జరగడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ లాంటి పెద్ద జిల్లాల ఉద్యోగులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇరవై ఏండ్లు సర్వీస్ ఉన్న ఉద్యోగులు కూడా, వారి స్థానిక జిల్లాల్లో ఉండే పరిస్థితి లేకుండా పోతోంది. కావున ఇలాంటి కొన్ని జిల్లాలకు పోస్టుల విభజన ప్రక్రియలో కొన్ని సడలింపులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేటాయింపు తీరు అన్ని రకాల ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాలను 7 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా విభజించారు. కేటాయింపులో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లాలనుకొనే వారిని ఆయా ప్రాంతాలకు పంపితే సరిపోయేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.1975లో లోకల్‌‌ క్యాడరైజేషన్‌‌ తర్వాత ఉద్యోగులను పనిచేస్తున్న స్థానాల్లో కొనసాగించారని, 2006లో కొందరు స్థానికేతరులను వారి జిల్లాలకు తరలించారని, ఇప్పుడు కూడా అలాగే చేస్తే సరిపోయేదని మెజార్టీ ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయం. అలా కాకుండా.. సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకురావడం వల్ల గందరగోళం నెలకొంది.  కనీసం కౌన్సెలింగ్‌‌ కూడా చేయకుండా జూనియర్‌‌‌‌ టీచర్లను వేరే జిల్లాలకు పంపడం సరికాదు. ఈ విధానం వల్ల లోకల్‌‌ జిల్లాల వాళ్లు పట్టణ ప్రాంతాలకు,  సీనియారిటీ లేకపోవడం వల్ల సొంత ప్రాంతానికి, కుటుంబానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల విభజన ప్రక్రియలో అవసరం మేరకు కొన్ని సడలింపులు కల్పించి, అందరికి న్యాయం జరిగే విధంగా చూడాలి. రాష్ట్రంలో లీడర్లు, నాయకులు కూడా ప్రభుత్వంపై ఆ దిశగా ఒత్తిడి తేవాలి.

టీచర్ల విషయంలో నిర్లక్ష్యం..


విద్యాశాఖ పరిధిలో రాష్ట్రంలో సుమారు లక్షా యాభై వేల మంది టీచర్లు పని చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన తీరు చాలా దారుణం. పెద్ద సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయుల క్యాడర్ సర్వీసుల విషయం, జిల్లాల కేటాయింపుల అంశంలో అనేక సమస్యలు ఎదురయ్యే చాన్స్​ఉంది. కావున ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 
‌‌‌‌                                                                                                                                                                                 - దర్శనం దేవేందర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం