కౌలు చేసే వాళ్లు  రైతులు కాదా?

బంగారు తెలంగాణ సాధిస్తామని చెపుతున్న కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వం.. వ్యవసాయ ఉత్పత్తుల్లో కీలక భూమిక పోషిస్తున్న 14 లక్షల మంది కౌలుదారుల సమస్యలను పరిష్కరించకపోతే ఎలా? వ్యవసాయాన్ని ప్రోత్సహించకుండా, రైతు ఆత్మహత్యలను ఆపకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యం? ఈ విషయాలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఆనాటి నిజాం పాలనలో భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ ప్రాంతం పోరాడింది. నిజాం అధీనంలోని భూములను ‘దున్నే వాడిదే భూమి’ అనే నినాదంతో అప్పటి కౌలుదారులు, రైతులు వీరోచితంగా పోరాడి 10 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పోరాటంలో 4 వేల మంది అమరులయ్యారు. అదే పోరాట స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రాన్ని సైతం అందించింది. కానీ, ఆనాడు 10 లక్షల ఎకరాలను రైతులు స్వాధీనం చేసుకుంటే ఈనాడు కౌలు రైతులకు గుర్తింపే లేని దుస్థితి ఏర్పడింది. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కౌలుదారుల హక్కుల కోసమని 1950లో రక్షిత కౌలుదారి చట్టం(టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ యాక్ట్ -1950) తీసుకువచ్చినా అది అమలుకు నోచుకోలేదు. ఈ చట్టాన్ని భూస్వాములు తీవ్రంగా వ్యతిరేకించారు. అధికార పార్టీలో భూస్వాములే ఎక్కువగా ఉండటంతో ఆ చట్టం అమలులోకి రాకుండా పోయింది. అప్పటి నుంచి కౌలుదారుల తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ల్యాండ్ లైసెన్స్‌‌‌‌డ్‌‌‌‌ కల్టివేటర్స్ యాక్ట్-2011 తీసుకువచ్చి 1950 చట్టంలో భూమిపై కౌలుదారులకు ఉండే హక్కును, ఇతర కొన్ని సౌకర్యాలను తొలగించారు. 2011 నాటి చట్టం ప్రకారం కౌలుదారులకు గుర్తింపు కార్డులు(లోన్ ఎలిజిబులిటి కార్డ్స్‌‌‌‌-–ఎల్ఈసీ) ఇచ్చి ఆ కార్డు పొందిన కౌలు రైతులకు 4 ముఖ్య ప్రయోజనాలను కల్పించారు. 1) పంట రుణం, 2) పంటల బీమా 3) పంట నష్టపరిహారం 4) సబ్సిడీలు, రాయితీలు కల్పిస్తారు. ఇందుకు రెవెన్యూ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు బాధ్యత వహించాలి. గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) ఫీల్డ్ ఎంక్వైరీ చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి.

ఏపీ వాళ్లకే ఎక్కువ గుర్తింపు కార్డులు

2011 డిసెంబర్‌‌‌‌లో ఉమ్మడి రాష్ట్రంలో ల్యాండ్ లైసెన్స్‌‌‌‌డ్ కల్టివేటర్స్ యాక్ట్ వస్తే.. 2012లో 6 లక్షల 80 వేల మంది కౌలు రైతులు దరఖాస్తు చేస్తే, వారిలో 5 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చి రూ.390 కోట్ల పంట రుణాలను అందించారు. 2013లో 4 లక్షల 80 వేల మంది కౌలుదారులు దరఖాస్తు చేస్తే 3 లక్షల 90 వేల మందికి కార్డులు ఇచ్చారు. ఇందులో 2 లక్షల 30 వేల మందికి రెన్యువల్ చేశారు. అంతాకలిపి రూ.133 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చిన గుర్తింపు కార్డులు, రుణాలు ఎక్కువ శాతం ఆంధ్రా ప్రాంతం వారికే పరిమితమయ్యాయి. 

ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కౌలు రైతు బాగుపడలే

ప్రత్యేక రాష్ట్రం వస్తే కౌలు రైతుల పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించాం. కానీ సొంత రాష్ట్రంలో కౌలురైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లుగా మారింది. రాష్ట్రం ఏర్పడిన 2014లో ఒక్క కౌలు రైతుకూ గుర్తింపు కార్డు ఇవ్వలేదు. 2015లో జీవో 282 ద్వారా 2011 నాటి ల్యాండ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌డ్‌‌‌‌ కల్టివేటర్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 4.5 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ ఏడాది 43,500 కౌలు గుర్తింపు కార్డులే ఇచ్చింది. అందులో 8 వేల మందికి రూ.26 కోట్ల రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. 2016లో ఆ 43 వేల కార్డులు కూడా నామమాత్రంగానే కొనసాగాయి. ఇక 2019–20లో ఒక్క కార్డు జారీ చేయలేదు. 

గుర్తింపు కార్డుల జారీలో నిర్లక్ష్యం

2011 నాటి చట్టం ప్రకారం ప్రతి ఏటా మే నెలలో అంటే ఖరీఫ్ ప్రారంభానికి ముందే గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఇందుకు రెవెన్యూ శాఖ అకౌంటబులిటీగా ఉండాలి. కానీ, ఇలా రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదు. భూ యజమానితో సంబంధం లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని చట్టం చెపుతుంటే.. రెవెన్యూ అధికారులు భూ యజమాని అభ్యంతరం తెలుపుతున్నాడని కుంటి సాకులు చెపుతున్నారు. 2016 నుంచి కౌలు రైతులు గుర్తింపు కార్డుల కోసం ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అసలుకే ఎసరు పెట్టింది. పంటలు పండించటంలో మెళకువలు తెలిసిన కౌలు రైతుల్లో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులే. దరఖాస్తు చేసుకునే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ కేంద్రాలు పట్టణ కేంద్రాల్లో మాత్రమే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో కౌలు రైతుల అప్లికేషన్లు భారీగా తగ్గాయి. 2016లో ఇచ్చిన గుర్తింపు కార్డులు నామమాత్రమే. ఈ ఏడాది సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ సమస్యలతో దరఖాస్తు చేసుకోవడమే గగనంగా మారింది. ఈ సమస్య పరిష్కరించాలంటే పాత పద్ధతిలో మాన్యువల్ గా గుర్తింపుకార్డులు ఇవ్వాలి. 

కౌలు రైతులను రాష్ట్ర సర్కారే ఆదుకోవాలి

రాష్ట్రంలో కౌలు రైతుకు గుర్తింపు కలగానే మిగిలింది. రైతు ఆత్మహత్యల్లో సగానికి పైగా కౌలు రైతులవే ఉంటున్నాయి. ఇప్పటికైనా కౌలు రైతులను ఆదుకునే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వారికి వెంటనే గుర్తింపు కార్డులు మాన్యువల్ గానైనా ఇచ్చి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఎరువుల రాయితీని కౌలు రైతులకూ వర్తింప చేయాలి. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేషియా ఇవ్వాలి. మిగులు భూములను భూమిలేని కౌలుదారులకు పంచాలి. రైతు పండించిన పంటలకు సరైన ధర నిర్ణయించి.. మార్కెట్ సౌకర్యం కల్పించాలి. కౌలు రైతులు ఆరుగాలం కష్టించడం, పంట పండించటమే కాకుండా గుండె ధైర్యంతో సమస్యల పరిష్కారానికి ఐకమత్యంగా ముందుకు సాగాలి. పోరాడాలి.