
విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేశాడు. అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘విజయశాంతి గారు మాట్లాడుతుంటే ఈ వేదికపై మా నాన్న గారు లేని లోటు భర్తీ అయినట్టు అనిపించింది.
తెలుగులోనే కాదు దేశంలోనే హీరోలతో సరిసమానంగా నిలిచిన ఏకైక మహిళా నటి విజయశాంతి గారు ఒక్కరే. ఇటీవల ఈ చిత్రం చూశా. ఇందులో నటించిన, పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టారని అర్థమైంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు కన్నీళ్లు ఆపుకోవడం నావల్ల కాలేదు. థియేటర్స్‌లో చూశాక అందరికీ అది అర్థమవుతుంది. క్లైమాక్స్ అలా రావడానికి ఒకే ఒక కారణం కళ్యాణ్ అన్న. ఎంత డెడికేటెడ్ గా నటించారంటే ఆయన కెరీర్‌లో స్పెషల్ సినిమాగా ఇది నిలిచిపోతుంది. విజయశాంతి గారిని తన తల్లిగా నమ్మేశారు కనుకే అంత అద్భుతంగా నటించగలిగారు. ఇక ఆగస్టు 14న నేను నటించిన ‘వార్ 2’ రాబోతోంది. త్వరలోనే అభిమానులు అందరినీ కలుస్తాను’ అని చెప్పారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘కొన్ని చిత్రాలు ఇంటికి వెళ్లాక కూడా ప్రేక్షకుల మనసులను హత్తుకుని ఉంటాయి. అలాంటి సినిమా ఇది. చాలా రోజులు ఈ చిత్రాన్ని గుర్తుపెట్టుకుంటారు’ అని అన్నాడు.
విజయశాంతి మాట్లాడుతూ ‘ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. తల్లిపడే ఆరాటం, కొడుకు చేసే పోరాటంతో కళ్యాణ్ రామ్‌కు, నాకు మధ్య జరిగే యుద్ధం అందరికీ నచ్చుతుంది. చాలా రోజుల తర్వాత మంచి పాత్ర పోషించాననే ఆనందం కలిగింది. ప్రతి మహిళకు దీన్ని అంకితం చేస్తున్నాం’ అని చెప్పారు. ఇందులో నటించడం గౌరవంగా భావిస్తున్నానని సయీ మంజ్రేకర్ చెప్పింది. ‘టీమ్ అందరం కలిసి బాధ్యతగా చేసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’ అని డైరెక్టర్ ప్రదీప్ అన్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీలో ఏ ఒక్కరు లేకపోయినా సినిమా ఉండేది కాదని నిర్మాతలు చెప్పారు. నటులు సొహైల్ ఖాన్, పృధ్వి, నాగ మహేష్, జోగి నాయుడు, లిరిక్ రైటర్ రఘురాం తదితరులు పాల్గొన్నారు.