ముంబై : రియల్ ఎస్టేట్, ఆఫ్‌షోర్ బెట్టింగ్ రంగాలలో తప్పుదోవ పట్టించే, చట్టవిరుద్ధ ప్రకటనలు భారీగా పెరుగుతున్నాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సిఐ) వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్– సెప్టెంబర్ 2024 మధ్య కాలంలో ఏఎస్‌సీఐ 4,016 ఫిర్యాదులను, 3031 ప్రకటనలను పరిశీలించింది. ఈ ప్రకటనల్లో 98శాతం వాటికి కొంత సవరణ అవసరమని సూచించింది.
మొత్తం 2,087 ప్రకటనలు చట్టాన్ని ఉల్లంఘించినట్టు గుర్తించింది. అక్రమ బెట్టింగ్‌ను ప్రోత్సహించే మరో 890 ప్రకటనల వివరాలను కౌన్సిల్ సమాచార అండ్ ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ)కి పంపింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రూపొందించిన 156 ప్రకటనల వివరాలను ఆయుష్ మంత్రిత్వ శాఖకు పంపించింది. మద్యాన్ని నేరుగా ప్రచారం చేసే 10 ప్రకటనలు, డీప్‌ఫేక్‌లకు సంబంధించి మరో నాలుగు ప్రకటనలు ఎంఐబీకి నివేదించామని కౌన్సిల్ వెల్లడించింది. మోసపూరిత ప్రకటనల్లో రియల్టీలో 34శాతం, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ 29శాతం, ఆరోగ్య సంరక్షణ 8శాతం, వ్యక్తిగత సంరక్షణ 7శాతం, ఆహారం, పానీయాల విభాగంలో ఆరు శాతం ఉన్నాయి.