
- 2018 నాటికే సొసైటీ రూ.8 కోట్ల నష్టంలో ఉంది
- మా హయాంలో తడిసిన వడ్ల వల్లే ఎక్కువ నష్టం
కోటగిరి, వెలుగు : ఎత్తొండ సొసైటీలో జరిగిన అవినీతి అంతా మాజీ అధ్యక్షుడు సోమశేఖర్ రావు పీరియడ్‌లోనే జరిగిందని, తమ పాలకవర్గంలో కాదని, తడిసిన వడ్ల వల్ల సొసైటీకి నష్టం వచ్చిందని ఎత్తొండ సొసైటీ తాజా మాజీ అధ్యక్షుడు అశోక్ పటేల్ ఆరోపించారు. మండల కేంద్రంలో ఎత్తొండ సొసైటీ డైరెక్టర్లతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దన్నారు. 2014 నుంచి 2018 వరకు జరిగిన 51 ఎంక్వయిరీలో సోమశేఖర్ రావు తన సొంతానికి సొసైటీ డబ్బులు రూ.1.68 కోట్లు వాడుకున్నట్లు తేలిందని ఆ డబ్బులు కట్టాల్సి వస్తుందనే ఆయన స్టే తెచ్చుకుని తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు.
2018 లో తమ పాలకవర్గం బాధ్యతలు తీసుకునే నాటికే సొసైటీ రూ.8 కోట్ల నష్టంలో ఉందని తెలిపారు. 2014, 15 సంవత్సరంలో సోమశేఖర్ రావు సొసైటీకి వడ్లు రాకున్నా సిబ్బంది పేర్లతో బిల్లులు చేసి రూ.73 లక్షలు కాజేశారని పత్రాలు చూపించారు. సోమ శేఖర్ రావు తమ పాలక వర్గానికి అప్పజెప్పిన వడ్ల స్టాక్ విలువ తహసీల్దార్ పంచనామా ప్రకారం రూ.2.52 లక్షలు ఉంటే ఆడిట్‌లో మాత్రం ఆయన రూ.3.4 కోట్ల వడ్ల స్టాక్ ఉన్నట్లు చూయించుకున్నారని అక్కడ వడ్లు లేకపోయినా ఉన్నట్లు చూపి రూ. కోటికి పైగా కాజేశారని ఆరోపించారు. తమ పాలకవర్గం హయాంలో పార్ బాయిల్డ్ రైస్ మిల్ వద్ద గోదాం లేకపోవడంతో వడ్లు తడిసి పోవటం వల్ల సొసైటీకి నష్టం వచ్చిందని, దీంతో పాటు రెండు సీజన్లలో తడిసిన వడ్లు సొసైటీకి అప్పటి మంత్రి, ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్, తహసీల్దార్, ఏవోలు బలవంతంగా పంపటంతో ఆ వడ్ల నుంచి సీఎంఆర్‌కు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వలేకపోయామన్నారు.
వడ్లు తడవటంతో మొత్తం బియ్యం రంగుమారాయని, ఆ బియ్యాన్ని బయట అమ్మి సొసైటీలో రూ.10 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఈమేరకు డీసీవో కు రాతపూర్వకంగా సమాధానం చెప్పినట్లు తెలిపారు. సొసైటీకి ఆనాటి నుంచి జరిగిన నష్టానికి లావాదేవీలు నడవటం లేదని రెండు మూడు రోజుల్లో తీర్మానం చేసి ఎక్కువగా ఉన్న స్టాఫ్ ను సైతం తొలగిస్తామని డైరెక్టర్లు తెలిపారు. సమావేశంలో డైరెక్టర్లు శ్రీనివాసరావు, హన్మంత్‌రావు, మన్నె పోశెట్టి, అగ్గు లింగయ్య, బొనిగె గంగాధర్ పాల్గొన్నారు.