అశ్వారావుపేట (భద్రాద్రికొత్తగూడెం), వెలుగు: సర్కార్ హాస్పిటల్‌లో ఇద్దరు నవజాత శిశువులు చనిపోయారు. పిల్లల డాక్టర్ లేకపోవడమే కారణంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో జరిగింది. అశ్వారావుపేట పట్టణంలోని పేరాయిగూడానికి చెందిన గంధం జ్యోతి గురువారం, నారంవారిగూడానికి చెందిన వల్లెపు మౌనిక శుక్రవారం ఉదయం డెలివరీ కోసం సర్కార్ హాస్పిటల్ లో చేరారు.
పుట్టిన ఇద్దరు శిశువుల గ్రోత్ సరిగా లేదని, వెయిట్ కూడా తక్కువగా ఉన్నారంటూ ప్రైవేట్ హాస్పిటల్ కు రెఫర్ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అక్కడికి వెళ్లాక పరీక్షించిన డాక్టర్లు శిశువులు అప్పటికే చనిపోయారని చెప్పారు. దీంతో సర్కార్ హాస్పిటల్ లో సరైన ట్రీటెమెంట్ అందకపోవడం, పిల్లల డాక్టర్ లేకపోవడం వల్లే శిశువులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్ పూర్ణచందు మాట్లాడుతూ శిశువుల గ్రోత్ సరిగా లేదని, డెలివరీ అయ్యాక శిశువుల్లో చలనం లేకపోవడంతో వేరే హాస్పిటల్ కు రెఫర్ చేశామన్నారు.