ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 17 న కొలొంబో వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్స్ లో శ్రీలంక జట్టు అనూహ్యంగా 50 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 37 బంతుల్లోనే మ్యాచుని ఫినిష్ చేసింది. దీంతో మ్యాచ్ మొత్తం రెండు గంటలైనా జరగకుండా పూర్తవడంతో ఇప్పుడు కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని దీనిపై స్థానిక పౌరహక్కుల సంస్థ ‘సిటిజెన్ పవర్ అగెనెస్ట్ బ్రైబరీ, కరప్షన్ అండ్ వేస్టెజ్’ కొలంబో పోలీస్ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
క్రికెటర్ల ఆటతీరుపై అనుమానాలు
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ వెంటనే విచారణ చేయాలంటూ స్థానిక పౌరహక్కుల సంస్థ చైర్మన్ "సమంతా తుషార" డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ " ఈ మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు బయట బారులు తీరి ఉండగానే మ్యాచ్ పూర్తయింది. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి. క్రికెటర్ల ఆట తీరుపై అనుమానాలు ఉన్నాయి. శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు, ప్లేయర్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలన్నీ బయటపెట్టాలి. క్రికెట్‌ను డబ్బు ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో ఆటగాళ్ల ఆటతీరుపై అనుమానాలు ఉన్నాయి. స్కూల్ స్థాయి క్రికెట్ లో కూడా ఇలాంటి స్కోర్లు నమోదు కావు." అని పేర్కొన్నాడు.
ఇక ఈ ఆసియా కప్ ఫైనల్ మ్యాచుల్లో సిరాజ్, హార్దిక్ పాండ్య చెలరేగడంతో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రికార్డ్ స్థాయిలో ఆసియా కప్ ని 8 వ సారి సొంతం చేసుకుంది.