ఓటర్ల బాటలో లీడర్లు..ఓటర్లను ఆకర్షించేందుకు ప్రోగ్రామ్స్​ నిర్వహణ

  • ఓటర్లను ఆకర్షించేందుకు ప్రోగ్రామ్స్​ నిర్వహణ
  • ఫండ్స్​ శాంక్షన్​ కోసం ప్రభుత్వ పెద్దల వద్దకు పరుగులు
  • గత హామీలను నేరవేర్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు

కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజకవర్గాల్లో పొలిటికల్​ యాక్టివిటీస్​ స్పీడయ్యాయి. ప్రతిపక్ష పార్టీల తరఫున బరిలో నిలిచేందుకు రెడీ అయిన నేతలు ఓటరు బాట పట్టారు. ఆయా వర్గాల ఓట్లను టార్గెట్​ చేసుకుంటుండగా, అధికార పార్టీకి చెందిన సిట్టింగ్​ ఎమ్మెల్యేలు కూడా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల టైమ్ లో, ఆయా సందర్భాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫండ్స్​శాంక్షన్​ చేయించుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దల వద్దకు పరుగులు పెడుతున్నారు.

జిల్లా కేంద్రం కామారెడ్డిలో..

కామారెడ్డి నియోజక వర్గంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు కుల సంఘాల వారితో మీటింగ్​లు నిర్వహిస్తున్నారని గ్రహించిన అధికార పార్టీ ఎమ్మెల్యే అలర్ట్ అయ్యారు. ఆయా గ్రామాల్లో కుల సంఘాలు, టెంపుల్స్​నిర్మాణాలకు గత ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల ప్రకారం ఫండ్స్​శాంక్షన్​ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్​ని కలిసి సీఎం స్పెషల్ ఫండ్స్​ నుంచి రూ.10 కోట్లు శాంక్షన్​ చేయించుకున్నారు.

యువతకు దగ్గరయ్యేందుకు..

జుక్కల్​ నియోజకవర్గంపై బీజేపీ, కాంగ్రెస్ ​పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టడంతో ప్రస్తుత ఎమ్మెల్యే యువ ఓటర్లు, ఇతర వర్గాల వారి ఓట్లను కాపాడుకునేందుకు  రంగంలోకి దిగారు. ఈనెల 25న బిచ్కుందలో భారీ జాబ్​మేళా నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా కంపెనీల ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు.  దీనికి పెద్ద సంఖ్యలో యూత్​ హాజరయ్యేలా చూశారు.

రైతులతో మీటింగ్ లు

రైతులకు దగ్గర కావాలనే ఉద్దేశంతో బాన్సువాడ నియోజకవర్గంలోని నెమ్లిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి శనివారం రైతులతో మీటింగ్ ​ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆత్మీయ సమ్మేళనాలతో..      

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలతో ఎమ్మెల్యే జాజుల సురేందర్ పార్టీ శ్రేణులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో మండలంలో మూడు, నాలుగు మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. మరో వైపు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు, చీరల పంపిణీ కూడా చేస్తున్నారు.