రామక్క గుర్తుపట్టేనా? .. బీఆర్ఎస్​కు పొంచిఉన్న గుర్తుల గండం

  • భువనగిరిలో కారుగుర్తు కిందే రోడ్డు రోలర్​
  • ఆలేరులో సమీపంలోనే చపాతీ రోలర్​ ముప్పు
  • అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే సీన్​ 

యాదాద్రి, వెలుగు :  గుర్తుల గుర్తుంచుకో.. రామకా! కారు గుర్తుంచుకో’ అని బీఆర్​ఎస్​ పార్టీ ప్రచార పాటను బాగానే మార్మోగిస్తోంది కానీ, తీరా ఎన్నికల రోజు ఓటు మిషన్లో ‘రామక్క ఆ కారు గుర్తును గుర్తు పడుతుందా లేదా?’ అన్నదే ఇప్పుడు బీఆర్​ఎస్​అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కారు గుర్తును పోలిన రోడ్​ రోలర్, చపాతీ రోలర్​ గుర్తులు రెండూ ఈవీఎంలో బీఆర్​ఎస్​ అభ్యర్థుల సమీపంలోనే ఉన్నాయి. గత ఎన్నికలో ఇలాంటి గుర్తులే బీఆర్​ఎస్​ పుట్టి ముంచినట్టు ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్​ఎస్​అభ్యర్థులకు గుర్తుల గండం తప్పడం లేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్​, చపాతీ రోలర్​ గుర్తులతో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదీ బీఆర్​ఎస్​ అభ్యర్థులకు సమీపంలో నే ఉండడం మరింత దడ  పుట్టిస్తోంది.

గుర్తుల ప్రభావం గట్టిగానే.. 

కిందటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ రెండు గుర్తులు కారు గుర్తుకు సమీపంలో ఉండడంతో ఆ పార్టీల అభ్యర్థులకు ఓట్లు ఎక్కువ వచ్చాయి. అవి బీఆర్​ఎస్​ ఓట్లే అని అందరి అంచనా.. అప్పడంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్​ఎస్​కు పరిస్థితి అనుకూలంగా ఉండటంతో కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు రోడ్డు రోలర్​, చపాతీ రోలర్ పడ్డా.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు తక్కువలో తక్కువ ఓట్లతో అయినా గెలిచారు. కొన్ని చోట్ల ఈ గుర్తులకు ఎక్కువ ఓట్లు రావడంతో బీఆర్​ఎస్​ లీడర్లు ఓడిపోయారని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈసారి కాంగ్రెస్​గాలి వీస్తుండడం, బీఆర్​ఎస్​ రెండు దఫాల పాలనను ప్రతిపక్షాలు ఎండగడుతూ ఓడించే పని పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ గుర్తుల గండం పొంచి ఉండడంతో ఇటు బీఆర్​ఎస్​ అభ్యర్థుల్లో, శ్రేణుల్లో మరింత ఆందోళన మొదలైంది. 

ఆ గుర్తులపై బీఆర్​ఎస్​ పోరాటం..

2018 ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని నకిరేకల్​తో పాటు మరికొన్ని సీట్లలో తమ అభ్యర్థులు ఓడిపోయారని బీఆర్​ఎచెబుతోంది.ఈ ఎన్నికల్లో ఆ గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని కోర్టును ఆశ్రయంచింది. అయితే బీఆర్​ఎస్​ పిటిషన్​ను కోర్టు తోసిపుచ్చింది. 

కారుకు సైడ్​ ఇవ్వబోమన్న రోలర్లు..

 ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్​, చపాతి రోలర్​ గుర్తులు ఈవీఎం బ్యాలెట్​లోకి రాకుండా చేయాలని బీఆర్​ఎస్​ ప్రయత్నించిందన్న ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే యుగ తులసి పార్టీ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇండిపెండెండ్లకు రోడ్డు రోలర్​ను వచ్చింది. 

కారుకు సమీపంలోనే ..

  •  భువనగిరిలో అసెంబ్లీ బ్యాలెట్​లో కారు గుర్తు నాలుగో నెంబర్​లో ఉండగా యుగతులసి అభ్యర్థి తోట శ్రీనివాస్​ సింబల్​ రోడ్డు రోలర్​ ఆరో నెంబర్​లో ఉంది. అలియన్స్​ ఆఫ్​ డెమోక్రటిక్​ రిఫామ్స్​ పార్టీ అభ్యర్థి నీల నర్సింహ్మా సింబల్​ చపాతి రోలర్​ తొమ్మిదో నెంబర్​లో ఉంది. కారుకు రోడ్డు రోలర్, చపాతి రోలర్​​కు పెద్దగా తేడా లేకపోవడంతో ఓటర్లు రోలర్​కు వేస్తారన్న ఆందోళన బీఆర్​ఎస్​ను వెంటాడుతోంది. 
  • ఆలేరులో కారు రెండో గుర్తుగా ఉండగా అలియన్స్​ ఆఫ్​ డెమోక్రటిక్​ రిఫామ్స్​ పార్టీ అభ్యర్థి గడ్డమీది శ్రావణి గుర్తు చపాతి రోలర్​ 6 నెంబర్​గా ఉంది. యుగతులసి అభ్యర్థి శిఖ శ్రీనివాస్​ గుర్తు రోడ్డు రోలర్​ 10వ నెంబర్​లో ఉంది. 
  • నాగార్జున సాగర్​లో మూడో నెంబర్లో కారు ఉండగా.. ఐదో నెంబర్​లో చపాతి రోలర్​ ఉంది. నల్గొండలో కారు రెండులో ఉండగా చపాతి రోలర్​ 5లో ఉంది. 
  • నకిరేకల్​, మునుగోడు, హుజూర్​నగర్​, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడలో రోడ్డు రోలర్​, చపాతి రోలర్​ గుర్తులు యుగతులసి, అలియన్స్​ ఆఫ్​ డెమోక్రటిక్​ రిఫామ్స్​ పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్​ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీఆర్​ఎస్​ సీట్లు తగ్గే అవకాశం కూడా ఉందని వస్తున్న అంచనాలకు తోడు.. ఈ రోడ్డు రోలర్​, చపాతీ రోలర్ల గండం కూడా దాటి గట్టెక్కుతారా లేదా? రామక్కకు కారు గుర్తు కనిపిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.