విశ్లేషణ: పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఆశలను.. చన్నీ నిలబెడ్తరా?

చరణ్​జీత్‌ సింగ్‌ చన్నీని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పంజాబ్‌ ఎన్నికల ఫలితాలను దళిత సీఎం అభ్యర్థి ఎంత వరకు ప్రభావితం చేయగలరనే అంశం మీద చాలా ఊహాగానాలు ఉన్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఓడితే మాత్రం రాహుల్‌ గాంధీకి గడ్డుకాలం తప్పదు. కాంగ్రెస్‌ గెలిస్తే రాహుల్‌ ప్రతిపక్ష బాధ్యతను తీసుకోవడమే కాక, కాంగ్రెస్‌ పార్టీని పూర్తి నియంత్రణలోకి తీసుకోవచ్చు. అయితే పంజాబ్​లో కాంగ్రెస్​ ఆశలు చన్నీ నిలబెట్టుకుంటారా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఉత్తరప్రదేశ్, పంజాబ్​ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చాలా మంది పొలిటీషియన్లకు కీలకంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్​ లీడర్ రాహుల్​గాంధీ, జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్, ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్ లాంటి వారందరికీ ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్​లో విజయం బీజేపీకి ఎంత అవసరమో.. అలాగే పంజాబ్​లో గెలుపు కాంగ్రెస్​ పార్టీకి, రాహుల్​గాంధీ లక్ష్యాలకు అంతే అవసరం. ఒకవేళ ఉత్తరప్రదేశ్​లో బీజేపీ ఓటమి పాలైనా నరేంద్రమోడీకి తన లక్​ను పరీక్షించుకునేందుకు మరికొన్ని చాన్స్​లు ఉన్నాయి. కానీ, రాహుల్​గాంధీ పరిస్థితి అలా కాదు. ఒకవేళ ఆయన పార్టీ పంజాబ్​లో ఓటమిపాలైతే.. రాహుల్​కు గడ్డు రోజులు తప్పకపోవచ్చు. అదే పంజాబ్​లో కాంగ్రెస్​ విజయం సాధిస్తే.. అప్పుడు ప్రతిపక్షాలను నడిపే బాధ్యతను తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కాంగ్రెస్​ పార్టీపై ఫుల్​ కంట్రోల్​ కూడా వస్తుంది. 
పంజాబ్​లో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 117. గత ఐదేండ్ల నుంచి ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్​ పార్టీ పాలిస్తోంది. అంతకు ముందు ప్రతి అసెంబ్లీ ఎన్నికకు అధికారంలోకి వచ్చే పార్టీలు మారాయి. కానీ చాలా కారణాల వల్ల 2007 నుంచి 2017 వరకు అంటే పదేండ్ల పాటు అకాలీదళ్​ పంజాబ్​లో పవర్​లో ఉంది. 2017 సంవత్సరం వరకు పంజాబ్​లో కాంగ్రెస్, అకాలీదళ్​ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ నడిచింది. . కానీ, 2017 తర్వాత అరవింద్​ కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆమ్​ఆద్మీ పార్టీ మూడో పార్టీగా అవతరించింది. ఆ ఎన్నికల్లో 20 మంది ఎమ్మెల్యేలను గెలిచిన ఆ పార్టీ పంజాబ్​లో ప్రధాన ప్రతిపక్షంగా అధికారిక హోదాను పొందింది. 2022 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన తర్వాత పంజాబ్​లో చతుర్ముఖ పోటీ కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్​సింగ్, బీజేపీ కలిసి నాలుగో కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి.
 

కాంగ్రెస్‌ కు ప్రయోజనాలు
 కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. అక్కడ అకాలీదళ్, ఆమ్​ఆద్మీ నుంచి మాజీ సీఎం అమరీందర్‌‌ సింగ్‌ – బీజేపీ కూటమి ఉన్నప్పటికీ ఎవరూ కలిసి పోటీకి దిగడం లేదు. దీంతో ప్రతిపక్షం మూడు పార్టీలుగా విడిపోయింది. ఈ విభజనే కాంగ్రెస్‌ గెలుపును సులువు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళితుడైన చరణ్​జీత్‌ చన్నీని ఎన్నుకొని చాలా పెద్ద రిస్క్‌ తీసుకుంది. 4 నెలలుగా చన్నీ పంజాబ్‌ను బాగానే పాలించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పంజాబ్‌లో దళితులు 30% కంటే ఎక్కువే ఉన్నారు. వారందరూ చన్నీకి ఓటు వేస్తారని కాంగ్రెస్‌ చాలా ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్‌కు ప్రజాదరణ కలిగిన నవజ్యోత్‌ సింగ్​సిద్ధూ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. సిద్ధూ భారీగా జనాలను ఆకర్షించగలరు. వ్యక్తిగతంగా ఆయనకు మంచి ఇమేజ్‌ ఉంది. సిద్ధూ సెలబ్రిటీ కావడంతో బాదల్‌, అమరీందర్‌‌ సింగ్‌కు సరైన జోడీ ఆయనే. సీఎం అభ్యర్థిగా చన్నీని ఎన్నుకుని దానిపై ఉన్న కాంట్రవర్సీని కాంగ్రెస్‌ పరిష్కరించింది. ఇది కాంగ్రెస్‌కు దళిత ఓట్లను తెచ్చిపెడ్తుందని పొలిటికల్​ ఎనలిస్టులు భావిస్తున్నారు. చన్నీ మినహా పంజాబ్‌లో దళిత ముఖ్యమంత్రిగా గతంలో ఎవరూ పని చేయలేదు.
 

కాంగ్రెస్‌ ఎదుర్కొనే సమస్యలు
చన్నీ, సిద్ధూ మధ్య మనస్పర్థలు వచ్చినప్పటి నుంచీ పంజాబ్‌లో వారి మధ్య సయోధ్య లేదు. చన్నీ ముఖ్యమంత్రిగా కొనసాగితే, పంజాబ్‌లో తనకు భవిష్యత్‌ ఉండదని సిద్ధూకు తెలుసు. చన్నీని సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవడంతో పంజాబ్‌లో ఒకవేళ కాంగ్రెస్‌ గెలిచినా సిద్ధూకు అవకాశం రాదు. ఎన్నికల తేదీకి ముందు సిద్ధూ ఎలా బిహేవ్‌ చేస్తారో చూడాలి. అన్ని సర్వేల్లో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్​ పార్టీనే ముందుంది. కేజ్రీవాల్‌ పంజాబ్‌కి కొత్త. తన హామీలన్నీ నెరవేర్చడంలో ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌కు విశ్వసనీయత ఉంది. అంతకుమించి కేజ్రీవాల్‌ నిజాయితీపరుడు. కనుక కేజ్రీవాల్ నుంచే కాంగ్రెస్​కు మంట ఎక్కువ. కేజ్రీవాల్‌ కూడా పంజాబ్‌ సీఎంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. పంజాబ్‌లో సరికొత్త రాజకీయాలు కావాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలని కేజ్రీవాల్ ఓటర్లందరికీ పదేపదే చెబుతున్నారు. పంజాబ్‌లో దళితులు 30% ఉన్నప్పటికీ వారందరూ విభిన్న సంస్థలుగా విడిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో దళిత కులాల్లో మాల, మాదిగలు ఎక్కువ. పంజాబ్‌లో మాత్రం దళితుల్లో డజను గ్రూప్‌లు మాత్రమే మాలలుంటాయి. దళితులు పాత పార్టీకే విధేయులై ఉండి, ఓట్లు చీలితే కాంగ్రెస్‌ ప్రయోగించిన దళిత కార్డ్‌ ఫ్లాప్‌ అవుతుంది. 2017లో కాంగ్రెస్‌ గెలిచినప్పుడు, పంజాబ్‌లో కేజ్రీవాల్‌ ఆధిపత్యం చెలాయించడం కంటే కాంగ్రెస్‌ గెలవడమే మంచిదని బీజేపీ, బాదల్స్‌ భావించారు. సర్వేలన్నీ పంజాబ్‌లో కేజ్రీవాల్‌ గెలుస్తారని ప్రకటించడంలో ఆయనను ఆపడానికి బాదల్స్‌, బీజేపీ తమ ఓట్లను కాంగ్రెస్‌కు ట్రాన్స్​ఫర్‌‌ చేశాయి. కానీ ఇప్పుడు మాత్రం బాదల్స్‌, బీజేపీ.. కాంగ్రెస్‌కు భయపడుతున్నందున కాంగ్రెస్‌ను ఆపడానికి తమ ఓట్లను కేజ్రీవాల్‌కు  బదిలీ చేయవచ్చు.పంజాబ్‌లో జైల్‌సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏండ్లు మినహాయించి, ఆ రాష్ట్రం ఏర్పడిన 1966 నుంచి అక్కడ ఒకే ఒక్క సిక్కు కాని ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆమ్‌ ఆద్మీ సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్​ సిక్కు కాదు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థి చన్నీ దళితుడు. పంజాబ్‌లోని జాట్‌లందరూ ఆప్‌ పార్టీ అభ్యర్థి మాన్‌కు మద్దతుగా నిలుస్తారా? అనేదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. మరోవైపు చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్‌ కూడా పెద్ద రిస్క్‌ తీసుకుంది.

కాంగ్రెస్‌పై ప్రభావం ఎంత?
పంజాబ్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే అది రాహుల్‌ కు గ్రాండ్‌ విక్టరీ అవుతుంది. కాంగ్రెస్‌ ఓడితే మాత్రం ప్రతిపక్షాన్ని నడపడం కాంగ్రెస్‌కు సాధ్యం కాదు. ప్రతిపక్షంలోని ఒక వర్గం కాంగ్రెస్‌ను కోరుకున్నప్పటికీ ప్రతిపక్షంలో రాహుల్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్​ ఓడితే, ప్రతిపక్షానికి నాయకత్వం వహించే బాధ్యతను కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌‌ తీసుకోవచ్చు. ప్రతిపక్ష నాయకత్వం నుంచి రాహుల్‌ ను తొలగించేందుకు పంజాబ్‌లో ఓటమిని బీజేపీ కోరుకుంటోంది. 13 ఎంపీలతో కూడిన పంజాబ్‌ చిన్న రాష్ట్రమే అయినా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక రాష్ట్రం. పశ్చిమ బెంగాల్‌లో 42 మంది ఎంపీలను మమత గెలుచుకున్నప్పటికీ ఆమెను జాతీయ స్థాయి నాయకత్వం వహించే స్థాయికి తీసుకెళ్లలేదు. కానీ పంజాబ్‌ మాత్రం జాతీయ నాయకత్వం నుంచి కొందరు లీడర్లను తప్పించవచ్చు లేదా పూర్తిగా కొత్తవారే రావొచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న యుద్ధాలే తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు.

                                                                                                                                                                                                                                       - పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్