డాక్టర్ కస్తూరి రంగన్ అధ్యక్షతన 2017 జూన్ లో ఏర్పడిన కమిటీ 2019లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ (ముసాయిదా)ను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు అందజేసింది. దాన్ని కేంద్ర క్యాబినెట్ 2020 జులై 29న ఆమోదించింది. ప్రతి పౌరుడి జీవితాన్ని స్పృశించేలా, వారి వారి సామర్థ్యాన్ని బట్టి దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మారి, సమసమాజ స్థాపనకు కృషి చేసేలా ఎన్‌ఈపీ 2020 రూపొందింది. ప్రస్తుత విద్యా వ్యవస్థ 21వ శతాబ్దానికి అనుగుణంగా లేనందువల్ల, పూర్వ ప్రాథమిక(ప్రీ ప్రైమరీ) విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూలమార్పులు చేయాలని ఎన్‌ఈపీ 2020 సిఫార్సుచేసింది. కొత్త విద్యావ్యవస్థలో భారతీయ సంప్రదాయాలు, విలువలకు ప్రాధాన్యతనిస్తూ, విద్యా నిర్మాణం పాలన, విద్యా సంస్థల నియంత్రణల్లో కూడా సంస్కరణలు సూచించింది. జాక్వస్ డెలోర్స్ రాసిన ‘లెర్నింగ్: ది ట్రెజర్ వితిన్’ ప్రకారం 21వ శతాబ్దపు విద్య నాలుగు పిల్లర్లపై ఆధారపడి ఉండాలి. విద్య నేర్చుకోవడం అనేది.. 1. లెర్నింగ్ టు నో, జ్ఞాన సముపార్జనకు, విద్యావకాశాల వల్ల జీవితాంతం ప్రయోజనం పొందడానికి; 2. లెర్నింగ్ టు డూ, ఒక వృత్తిని ఎంచుకోవడానికి, నిత్య జీవితంలో, వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి; 3. లెర్నింగ్ టు లీవ్ టు గెదర్ – భిన్న సామాజిక, సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన, సమాజంలో ఒకరిపై మరొకరు ఆధారపడటం, బహుళత్వాన్ని గౌరవించడం, శాంతిని కాంక్షించడం వంటి ‘సంఘ విలువలు’ అభివృద్ధిపరచడం; 4. లెర్నింగ్ టు బి – వ్యక్తి మూర్తిమత్వానికి(పర్సనాలిటీ), వారు సొంతంగా నిర్ణయాలు తీసుకొనేలా, నైతిక బాధ్యతలు పెంపొందేలా, వ్యక్తి ఏ సామర్థ్యాన్ని అయినా కూడా పెంపొందించేదిగా ఉండాలి. విశాల దృక్పథంతో చూసినప్పుడు, విద్యార్థుల్లో సంపూర్ణమైన అభివృద్ధికి పాటుపడేదే నిజమైన విద్య. ఫౌండేషనల్ స్కిల్స్ అయిన అక్షరాస్యత, గణించడం, హయ్యర్ ఆర్డర్ స్కిల్స్ అయిన క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ మాత్రమే కాకుండా సామాజిక, భావోద్వేగ స్కిల్స్ కూడా విద్యార్థులు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో వీటిని ‘సాఫ్ట్ స్కిల్స్’ అంటున్నారు. అందువల్ల నేటి తరం విద్యార్థులు విద్యా, సామాజిక, భావోద్వేగ సామర్థ్యాలు పెంపొందించుకోవడం అవసరం. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎన్‌ఈపీ 2020 రూపుదిద్దుకున్నది.
గత పాలసీల లక్ష్యాలూ ముఖ్యమే
స్వాతంత్ర్యానంతరం తీసుకువచ్చిన విద్యా పాలసీలు ముఖ్యంగా కొఠారి కమిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(1986/1992) ల్లో ఎక్కువగా విద్య అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ప్రతి ఊరిలో జనాభాను బట్టి బడి/కాలేజ్ స్థాపించడం, ఆ విద్యాసంస్థల్లో అన్ని సామాజిక వర్గాల వారిని నమోదు చేసేవిధంగా చర్యలు ఉండేవి. ఎన్‌ఈపీ 1986/92 సిఫార్సుల ఆధారంగానే దేశంలో ‘సార్వత్రిక ప్రాథమిక విద్య’ ను సాధించడంలో అతి ముఖ్యమైన ఆర్టికల్21-A ను 86 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు. దాని ప్రకారం దేశంలోని 6- నుంచి14 సంవత్సరాల వయసులోపు పిల్లలు ఉచిత నిర్బంధ విద్యను పొందడం వారి ప్రాథమిక హక్కు. అయితే, దేశంలో నూతన ఆర్థిక సంస్కరణల అనంతరం సైన్స్, టెక్నాలజీ, గ్లోబలైజేషన్, నాలెడ్జ్ సొసైటి, నాలెడ్జ్ ఎకానమీ అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కానీ, గత పాలసీల్లో ఈ కొత్త అంశాల ప్రస్తావన ఉండదు. నిజానికి ఉన్నత విద్యలో సిలబస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. అప్పుడే యువతలో జ్ఞానం, నైపుణ్యం, సకారాత్మక వైఖరులను జొప్పిస్తూ, ఉద్యోగానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించడం ద్వారా దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన సాధ్యపడుతుంది.
ఎన్‌ఈపీ అమలు సవాలు
యునైటెడ్ నేషన్స్ ఎస్‌డీజీ 4 ప్రకారం 2030 వరకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ సమానంగా నాణ్యమైన విద్యను అందించడం, వారికి జీవితాంతం విద్యను నేర్చుకొనే అవకాశాలు కల్పించడం జరగాలి. ప్రతి దేశం పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తూ ప్రతి పౌరుడికి నాణ్యమైన జీవితాన్ని అందించాలి. పర్యావరణ కాలుష్యం, సుస్థిర అభివృద్ధి పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. ఎన్‌ఈపీ 2020 ప్రకారం, 2030–-32 వరకు ఇండియా,10 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుతుంది. ప్రతిభాధారిత జ్ఞాన సమాజం ఏర్పాటు చేయాలనే స్వప్నం, ఈ ఎన్‌ఈపీ 2020 పాలసీని అమలు చేసినప్పుడే సాకారమవుతుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో తీసుకొనే చర్యల తర్వాతనే ఈ పాలసీ ప్రభావం ఉంటుంది. స్థానిక, వాస్తవిక పరిస్థితులను బేరీజు వేసుకొని ఆచరణాత్మక ఆలోచనలతో వ్యూహాత్మక ప్రణాళికలను సమర్థంగా అమలు చేసినప్పుడే ఎన్‌ఈపీ 2020 లక్ష్యాలు నెరవేరుతాయి. దీనికోసం మొదటగా రాష్ట్రాలు, వాటి స్థానిక అవసరాలనుబట్టి పాలసీలోని ప్రాధాన్య లక్ష్యాలను గుర్తించాలి. బలహీన వర్గాలు, భిన్న సంస్కృతుల పిల్లలు, యువతను విద్యారంగంలో చేర్చుకునేలా ప్రణాళికలు చేసి, అమలు పరచాలి. విధానాలు, వ్యూహాలు వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. ఎన్‌ఈపీ 2020 విజయం పూర్తిగా దాని అమలు చేసే విధానంపైనే ఆధారపడి ఉన్నది.
భారతీయ వారసత్వమే దేశ విజ్ఞాన గని
సంపూర్ణ విద్యను అందించడంలో భారతదేశానికి గొప్ప చరిత్ర ఉన్నది. పురాతన కాలంలో విద్య పరమావధి జ్ఞానార్జనో లేదా వృత్తో కాదు. విద్య ఆత్మ సాక్షాత్కారానికి, అన్ని బంధాల నుంచి విముక్తి కలిగించే ఒక సాధనంగా విద్యను చూసేవారు. చరకుడు, శుశ్రుతుడు, ఆర్యభట్ట, భాస్కరాచార్యుడు, చాణక్యుడు, పతంజలి, పాణిని మొదలైనవారు ప్రాచీన భారతదేశంలో పేరెన్నికగన్న పండితుల్లో కొందరు. వారు ప్రపంచ జ్ఞాన భాండాగారానికి ఎంతో విజ్ఞానాన్ని అందించారు. దేశంలో ఏమూల చూసినా దేవాలయాలపై శిల్పాకళా సౌందర్యం, వాటి నిర్మాణంలోని ఇంజనీరింగ్ -వాస్తు నైపుణ్యం, వాటిలో వాడిన మెటీరియల్ ఇప్పటికీ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నది. ఇలాంటి అత్యంత విలువైన జ్ఞానాన్ని ప్రజాశ్రేయస్సు కోసం కాపాడుతూ, ముందు తరాలకు అందించడమే కాకుండా, దాన్ని విద్యావ్యవస్థలో ఇనుమడింపచేసి, భవిష్యత్తులో విద్యార్థులు పరిశోధనల ద్వారా ఆ వారసత్వ సంపదను నవీకరించాలి.
- డా. శ్రీరాములు గోసికొండ,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
నర్సీ మోంజీ డీమ్డ్ యూనివర్సిటీ