ఇండియన్ ఆర్మీ, ఆస్ట్రేలియన్ ఆర్మీల సంయుక్త సైనిక విన్యాసాలు ఆస్ట్రాహింద్ – 2024 మూడో ఎడిషన్ మహారాష్ట్రలో నవంబర్ 8 నుంచి 21 వరకు జరగుతున్నాయి. ఈ విన్యాసాలను ఇరు దేశాలు ప్రతి ఏటా ఒక దాని తర్వాత మరొకటి నిర్వహిస్తాయి.
ప్రాతినిధ్యం వహిస్తున్న బృందాలు
140 మంది సిబ్బందితో కూడిన భారత బృందం ప్రధానంగా డోగ్రా రెజిమెంట్‌కు చెందిన బెటాలియన్, భారత వైమానిక దళానికి చెందిన 14 మంది సిబ్బంది భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 10వ బ్రిగేడ్‌లోని రెండో డివిజన్ 13వ లైట్ హార్స్ రెజిమెంట్ నుంచి 120 మంది ఆస్ట్రేలియన్ ఆర్మీ బృందం ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని చాప్టర్ 7 అనుసరించి ఇరు దేశాలతో శాంతిని నెలకొల్పేందుకు సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు.
ప్రధాన లక్ష్యం
భారత్, ఆస్ట్రేలియాల మధ్య సైనిక సత్సంబంధాలను బలోపేతం చేయడం, ఇరుదేశాలకు చెందిన సాయుధ దళాల సామర్థ్యాలను సమర్థంగా వినియోగించేందుకు సన్నద్ధం కావడం. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. అలాగే, ఇరుదేశాలు సాంకేతిక పద్ధతులు, విధానాలు జాయింట్ ఎక్సర్సైజ్ ద్వారా ఎక్స్ఛేంజ్ చేసుకుంటాయి. ఈ విన్యాసాలు కంబాట్ కండిషనింగ్, టాక్టికల్ ట్రైనింగ్, వాలిడేషన్ దశల్లో జరుగుతాయి. రెండో ఎడిషన్ విన్యాసాలు ఆస్ట్రేలియాలో జరిగాయి.