
హైదరాబాద్, వెలుగు: నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెండ్ చేసిన ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేష్‌ను డిస్మిస్ చేయాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. తన దగ్గర శిక్షణలో ఉన్న అథ్లెట్లు ప్రత్యూష, శ్రీనివాస్ డోపింగ్ టెస్టు నుంచి తప్పించుకోవడం వెనుక రమేశ్ హస్తం ఉందని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చాగంటి రాజేష్, జసలికంటి వినోద్ అన్నారు.
గచ్చిబౌలిలోని సాయ్ సెంటర్‌లో పని చేస్తున్న రమేశ్.. అక్కడ శిక్షణ పొందుతున్న చాలా మంది అథ్లెట్ల కోసం పలు కార్పొరేట్ కంపెనీలు అందించే సీఎస్‌ఆర్ ఫండ్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. రమేశ్ కుటుంబ సభ్యుల అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని అన్నారు. రమేశ్‌ను విధుల నుంచి పూర్తిగా తొలగించి డోపింగ్ అంశంతో పాటు సీఎస్‌ఆర్ ఫండ్స్ దుర్వినియోగం విషయంలోనూ లోతైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.