- దళిత మహిళపై సర్పంచ్ దాడి .. కులం పేరుతో తిడుతూ రాళ్లతో కొట్టారు
- నోట్లో నుంచి రక్తం వస్తున్నా.. కిందపడేసి కాళ్లతో తొక్కిన్రు
- నల్గొండ జిల్లా వద్దిపట్లలో దారుణం
- భూ తగాదాలే గొడవకు కారణం
- సర్పంచ్ కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు
పెద్దఆడిశర్లపల్లి/దేవరకొండ, వెలుగు: భూ తగాదాలో ఓ దళిత మహిళపై సర్పంచ్, ఆమె కుటుంబసభ్యులు దాడి చేశారు. కులం పేరుతో దూషిస్తూ, రాళ్లతో కొడుతూ, కిందపడేసి కాళ్లతో తొక్కారు. ఈ దాడిలో ఆ మహిళ నాలుగు పళ్లు ఊడిపోయాయి. నోట్లో నుంచి తీవ్ర రక్తస్రావం అవుతున్నా దాడి చేశారు. శనివారం నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామంలో జరిగిందీ అమానవీయ ఘటన. గ్రామానికి చెందిన ఎన్నిక శారద, వెంకటేశ్వర్లు దంపతులకు గ్రామంలోని 175 సర్వే నంబర్‌లో 2 ఎకరాలు, 184 సర్వే నంబర్‌లో 35 గుంటల భూమి ఉంది. గతంలో 175 సర్వే నంబర్‌లోని 1.05 ఎకరాలు,184 సర్వే నంబర్‌లో 35 గుంటల భూమిని గ్రామ సర్పంచ్ పాలకూర్ల ధనమ్మ కుటుంబానికి విక్రయించారు. 175 సర్వే నంబర్‌లోని మిగిలిన 35 గుంటల భూమి శారద భర్త వెంకటేశ్వర్లు పేరు మీద ఉంది. ఈ భూమిలోనే వీరికి సంబంధించిన బోరు ఉండగా.. ప్రస్తుతం దీనికి పక్కనే ఉన్న అసైన్డ్ భూమిలో పంటలు పండిస్తున్నారు.
అయితే 175 సర్వే నంబర్, 184 సర్వే నంబర్‌కు దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో సర్పంచ్ కుటుంబ సభ్యులు 175 సర్వే నంబర్‌లోని రెండెకరాల భూమిని సాగు చేస్తున్నారు. ఆ రెండెకరాల్లో తమకు చెందిన 35 గుంటల భూమి ఉందని శారద, ఆమె భర్త వెంకటేశ్వర్లు పలుమార్లు సర్వే చేయించారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య పంచాయితీ కూడా జరిగింది. కానీ, సర్పంచ్ భర్త వినలేదు. ఈ క్రమంలో శనివారం 176 సర్వే నంబర్‌లోని పక్కనే ఉన్న తమ పొలానికి శారద నీళ్లు పెట్టేందుకు వెళ్లింది. ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర వైర్లు కట్ చేసి ఉండడాన్ని గమనించింది. ఆ ట్రాన్స్‌ఫార్మర్ సర్పంచ్ పొలంలో ఉండడంతో అక్కడే ఉన్న సర్పంచ్ భర్త ఆంజనేయులును వైర్లు ఎందుకు కట్ చేశారని శారద ప్రశ్నించింది.
బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన డీఎస్పీ
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శారదను ఆదివారం డీఎస్పీ గిరి పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ తగాదా కారణంగా గ్రామ సర్పంచ్ ధనమ్మ, ఆమె కుటుంబసభ్యులు కులం పేరుతో దూషించి దాడి చేశారని బాధితురాలు డీఎస్పీకి వివరించింది. ఘటనపై పూర్తి వివరాలను సేకరించి, కేసు నమోదు చేస్తామని డీఎస్పీ చెప్పారు.
బూతులు తిడుతూ దాడి..
శారదపై అప్పటికే కోపంతో ఉన్న సర్పంచ్ ధనమ్మ, ఆమె భర్త ఆంజనేయులు, ఇతర కుటుంబసభ్యులు మారయ్య, లక్ష్మయ్య వాగ్వాదానికి దిగారు. శారదను కులం పేరుతో దూషించారు. ఎందుకు తిడుతున్నారని శారద ప్రశ్నించగా.. ఆగ్రహించిన సర్పంచ్ కుటుంబ సభ్యులు ఆమెను కొట్టారు. కింద పడేసి కాళ్లతో ఇష్టమొచ్చినట్లు దాడి చేశారు. శారద మొఖంపై రాళ్లతో కొట్టడంతో నాలుగు పళ్లు ఊడిపోయాయి. సమాచారం అందుకున్న శారద కుటుంబ సభ్యులు ఆమెను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శారద భర్త వెంకటేశ్వర్లు కుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
భగ్గుమన్న దళిత సంఘాలు..-
వద్దిపట్ల ఘటనపై పలు దళిత సంఘాలు భగ్గుమన్నాయి. వివాదంలో ఉన్న భూమిని పరిశీలించడంతో పాటు హాస్పిటల్‌లోని బాధితురాలిని పరామర్శించారు. వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా కబ్జా చేయడమే కాకుండా దళిత మహిళను కులం పేరుతో దూషిస్తూ చంపేందుకు యత్నించడం దారుణమన్నారు. వెంటనే ఆ గ్రామ సర్పంచ్ ధనమ్మ, ఆమె భర్త ఆంజనేయులు, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.