IND vs AUS: క్యారీ, స్మిత్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా ముందు డీసెంట్ టార్గెట్

IND vs AUS: క్యారీ, స్మిత్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా ముందు డీసెంట్ టార్గెట్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. ఒకదశలో భారీ స్కోర్ ఖాయమనుకున్నా భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. 73 పరుగుల చేసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్ గా రాణించాడు. క్యారీ (61) హాఫ్ సెంచరీ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడగా.. హెడ్ పవర్ ప్లే లో వేగంగా ఆడి సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. భారత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. పాండ్య, అక్షర్ పటేల్ కు తలో వికెట్ లభించింది.      

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం లభించలేదు. మాథ్యూ షార్ట్ స్థానంలో జట్టులోకి వచ్చిన కూప‌ర్ కాన‌ల్లీ(0) డకౌట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న కాన‌ల్లీ ఖాతా తేవరకుండానే పెవిలియన్ చేరాడు. షమీ ఓ చక్కని బంతితో అతన్ని బోల్తా కొట్టించాడు. ఈ దశలో ట్రావిస్ హెడ్ కౌంటర్ అటాక్‌ చేస్తూ బౌండరీల వర్షం కురిపించాడు.  ప్రమాదకర ట్రావిస్ హెడ్ (39; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ను వరుణ్‌ చక్రవర్తి పెవిలియన్‌కు పంపి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. 

సీనియర్లు లబు షేన్, స్టీవ్ స్మిత్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. మూడో వికెట్ కు 56 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అయితే జడేజా ఒక్కసారిగా విజృంభించి లబుషేన్ (29) తో పాటు ఇంగ్లిస్ (11) ను ఔట్ చేశాడు. 4 వికెట్లు పడినా స్మిత్(73), క్యారీ (61) వేగంగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. వీరి ఆటతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ ఖాయమనుకున్నా.. వరుసగా స్మిత్, మ్యాక్స్ వెల్ (7) వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చివర్లో క్యారీ లోయర్ ఆర్డర్ తో విలువైన పరుగులు సమకూర్చి ఆసీస్ స్కోర్ ను 250 పరుగుల మార్క్ కు చేర్చాడు.