Cricket World Cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో అతి పెద్ద విజయం.. ఆసీస్ ధాటికి చిత్తయిన నెదర్లాండ్స్

Cricket World Cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో అతి పెద్ద విజయం.. ఆసీస్ ధాటికి చిత్తయిన నెదర్లాండ్స్

వరల్డ్ కప్ ఆస్ట్రేలియా ఛాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. టోర్నీ ప్రారంభంలో అనూహ్య పరాజయాలు ఎదుర్కొన్న కంగారూలు ఎట్టలకే విజయాల బాట పట్టారు. శ్రీలంకపై గెలిచి ఈ మెగా టోర్నీలో బోణీ కొట్టిన ఆసీస్.. ఆ తర్వాత మ్యాచ్ లో పాకిస్థాన్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. తాజాగా నెదర్లాండ్స్ పై వరల్డ్ కప్ లోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకొని ఈ వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ కొట్టింది.
 
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పసికూన నెదర్లాండ్స్ ను 21 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో ఆసీస్ కు 309 పరుగుల భారీ విజయం దక్కింది. 2015 లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 275 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్ తన రికార్డ్ ను తానే బ్రేక్ చేసుకుంది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో విక్రమ్ జీత్ సింగ్ 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు వికెట్లు తీసుకోగా.. మిచెల్ మార్ష్ కు రెండు వికెట్లు దక్కాయి. స్టార్క్, హాజెల్ వుడ్, కమ్మిన్స్ కు తలో వికెట్ లభించింది. 

ఇక అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా  మ్యాక్స్ వెల్ (106), వార్నర్ (104) సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్మిత్ (71), లబుషేన్(62) అర్ధ సెంచరీలతో రాణించారు. ఈ విజయంతో ఆసీస్ ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా.. నెదర్లాండ్స్ మాత్రం చివరి స్థానానికి వెళ్ళిపోయింది. ఈ వరల్డ్ కప్ లో ఆసీస్ తమ తదుపరి మ్యాచ్ ఈ అక్టోబర్ 28న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ తో తలపడుతుంది.