మెల్‌బోర్న్: ఇద్దరు గ్రాండ్‌స్లామ్ మాజీ చాంపియన్స్ మధ్య పోరులో పోలెండ్ స్టార్ ప్లేయర్, వరల్డ్ రెండో ర్యాంకర్ ఇగా స్వైటెక్‌దే పైచేయి అయింది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో రెండోసీడ్ స్వైటెక్ 6–1, 6–0తో ఎమ్మా రదుకానె (బ్రిటన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గంటా 10 నిమిషాల మ్యాచ్‌లో స్వైటెక్.. స్పిన్నింగ్, హై బౌన్సీ ఫోర్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడింది. ఎమ్మా కొట్టిన ప్రతి షాట్‌కు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చింది. మ్యాచ్‌లో స్వైటెక్ 2 ఏస్‌లు, 24 విన్నర్లు కొట్టింది. 12 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని కాచుకుంది.
ఇక ఎమ్మా ఒక్క బ్రేక్ పాయింట్‌ను కూడా కాచుకోలేదు. ఇతర మ్యాచ్‌ల్లో నవారో (అమెరికా) 6–4, 3–6, 6–4తో ఆన్స్ జుబెర్ (ట్యూనీషియా)పై, రిబకినా (కజకిస్తాన్) 6–3, 6–4తో యస్ట్రేమస్కా (ఉక్రెయిన్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 2–6, 6–4, 6–0తో పౌలిని (ఇటలీ)పై, మాడిసన్ కీస్ (అమెరికా) 6–4, 6–4తో కొలిన్స్ (అమెరికా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–3, 5–7, 6–7 (1/7), 4–6తో గైల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) చేతిలో కంగుతిన్నాడు.మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ జానిక్ సినర్ (ఇటలీ) 6–3, 6–4, 6–2తో గిరోన్ (అమెరికా)పై గెలిచి ముందంజ వేశాడు. మెన్స్ డబుల్స్‌లో ఎన్. శ్రీరామ్ బాలాజీ (ఇండియా)–మిగ్వెల్ ఎంజెల్ (మెక్సికో) 6–7 (1/7), 6–4, 3–6తో నునో బోర్జెస్–ఫ్రాన్సిస్కో కాబ్రల్ (పోర్చుగల్) చేతిలో ఓడారు.