- సీన్ రీక్రియేషన్ కోసం ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు
- తప్పించుకుని పారిపోయేందుకు నిందితుడు భరత్ సోని యత్నం
- వెంబడించి పట్టుకున్న పోలీసులు
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 12 ఏండ్ల బాలిక రేప్ కేసులో ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా భరత్ సోని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఆటోలో సీటుకు రక్తపు మరకలను గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ‘‘సీన్ రీక్రియేట్ చేసేందుకు, ఆధారాలను సేకరించేందుకు ఘటనా స్థలికి భరత్ సోనిని తీసుకెళ్లాం. అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంబడించి పట్టుకున్నాం. జీవన్ ఖేడీ ప్రాంతంలో ఇదంతా జరిగింది. నిందితుడిని పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి” అని మహాకాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అజయ్ వర్మ చెప్పారు. సిటీలో నానా ఖేడాలో భరత్ సోని ఉంటాడని తెలిపారు. ఉజ్జయినిలోని మహాకాల్ స్టేషన్ పరిధిలో వీధుల్లో అర్ధనగ్నంగా, రక్తం కారుతున్న పరిస్థితుల్లో సాయం కోసం అర్థిస్తూ బాలిక తిరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మరో ఐదుగురిని ప్రశ్నిస్తున్నారు. బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. కాగా, దుండగుల చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలు సాయం కోసం వేడుకుంటూ కాలినడకన 8 కిలోమీటర్లు నడిచినట్లు తెలిసింది. అయితే, బాధిత బాలికకు స్థానికులు సాయం చేయలేదన్న వార్తలను పోలీసులు ఖండించారు. కొందరు డబ్బులు, బట్టలు ఇచ్చారని చెప్పారు. బాధితురాలు సాయం కోసం అడగకపోవడంతో స్థానికులకు విషయం తెలియకే అలా రియాక్ట్ అయ్యారన్నారు.
అక్కడ తప్పిపోయిన అమ్మాయేనా?
సత్నా జిల్లాలో ఈనెల 25న ఓ బాలిక కనిపించకుండాపోయింది. ఈ మేరకు ఆమె బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్ అయిన అమ్మాయి, అత్యాచార బాధితురాలి ఏజ్ ఒక్కటే. తప్పిపోయిన అమ్మాయే బాధితురాలా? అనేది తేలాల్సి ఉంది.
బట్టలు అందించి.. భరోసానిచ్చి.. బాలికను రక్షించిన పూజారి
బద్నాగర్‌లో బాలికను రక్షించిన పూజారి రాహుల్ శర్మ.. బాలిక పరిస్థితి గురించి వివరించారు. ‘‘సోమవారం ఉదయం 9.30 సమయంలో ఆశ్రమం నుంచి బయటకు వస్తుండగా గేట్ల దగ్గర బాలికను గుర్తించాం. ఆమెకు నా బట్టలు ఇచ్చాను. రక్తం కారుతూ, కళ్లు వాచిపోయి కనిపించాయి. ఆమె ఏం మాట్లాడలేకపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. మహంకాల్ పోలీసులు 20 నిమిషాల్లో వచ్చి బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు” అని ఆయన తెలిపారు. బాలిక తమతో ఏదో చెప్పేందుకు ప్రయత్నించిందని, కానీ తమకు అర్థం కాలేదని చెప్పారు. ‘‘ఆమె పేరు, కుటుంబం గురించి అడిగాం. సురక్షిత ప్రాంతంలోనే ఉన్నావని భరోసా ఇచ్చాం. కానీ ఆమె చాలా భయపడిపోయింది. వేరే వాళ్లు ఆమె వద్దకు వచ్చినప్పుడు భయపడి నా వెనుక దాక్కునేందుకు ప్రయత్నించింది” అని పూజారి చెప్పారు.