
- బాబా వ్యాఖ్యలతో షాకయ్యామని కామెంట్
- వ్యాఖ్యలు, వీడియోలను తొలగిస్తానన్న యోగా గురు
న్యూఢిల్లీ: హమ్ దర్ద్ లేబరేటరీస్ కు చెందిన రూ అఫ్జా పానీయంపై ప్రముఖ యోగా గురు, పతంజలి ఫౌండర్ బాబా రామ్ దేవ్ చేసిన ‘షర్బత్ జిహాద్’ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. రామ్ దేవ్ వ్యాఖ్యలతో కోర్టు అంతరాత్మ షాకైందని, ఆయన వ్యాఖ్యలు సమర్థనీయం కాదని పేర్కొంది. షర్బత్ జిహాద్ అంటూ రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై హమ్ దర్ద్ లేబరేటరీస్ వేసిన కేసుపై జడ్జి జస్టిస్ అనిల్ బన్సాల్ విచారణ చేపట్టారు. తమ సంస్థ పేరుప్రతిష్టలు దిగజార్చేలా రామ్ దేవ్ వ్యాఖ్యలు చేశారని, అంతేకాకుండా ఆయన వ్యాఖ్యలు మతపరమైనవని ఆ సంస్థ పేర్కొంది.
క్లైంట్ (రామ్ దేవ్) నుంచి సూచనలు తీసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రామ్ దేవ్ తరపు న్యాయవాదికి జడ్జి సూచించారు. రూ అఫ్జాపై చేసిన రామ్ దేవ్ చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుంటామని అడ్వొకేట్ వెల్లడించారు. ఐదు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేశారు. కాగా.. కోర్టు విచారణ
పూర్తయ్యాక రామ్ దేవ్ స్పందించారు. రూ అఫ్జాపై తాను చేసిన వ్యాఖ్యలు, వీడియోలను తొలగిస్తానని ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.