![బండి సంజయ్ వి దిగజారుడు మాటలు : దండి వెంకట్](https://static.v6velugu.com/uploads/2025/01/bahujana-left-party-state-president-dandi-venkat-fires-on-bandi-sanjoy_I3yxdToU7C.jpg)
- వెంటనే గద్దర్ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలి
- గ్రేటర్‌వ్యాప్తంగా నిరసనలు.. దిష్టిబొమ్మల దహనం
సిటీ నెట్వర్క్, వెలుగు: ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ మండిపడ్డారు. మంగళవారం నల్లకుంటలోని పార్టీ ఆఫీసులో వెంకట్మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇష్టమొచ్చిన కామెంట్లు చేయడం దారుణమన్నారు. వెంటనే గద్దర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పక్కా ప్లాన్ తోనే బండి సంజయ్ గద్దర్ పై కామెంట్స్ చేశారని లింగోజీగూడ కార్పొటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఈటల రాజేందర్, గద్దర్ భావజాలం ఒక్కటేనని, గద్దర్ ను అడ్డుపెట్టుకొని ఈటల రాజేందర్ ను ఉద్దేశించి బండి సంజయ్ కామెంట్స్చేశారన్నారు. గద్దర్ భుజంపై తుపాకీ పెట్టి ఈటల రాజేందర్ ను బండి సంజయ్ ను కాల్చాడన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం సాయంత్రం అశోక్ నగర్ చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు. అభిషేక్ కెనడి, నరేందర్ యాదవ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్ వ్యాఖ్యల్ని గద్దర్ గళం అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. గద్దర్ ను విమర్శించే స్థాయి , అర్హత బండి సంజయ్ కు లేదని అసోసియేషన్ ఫౌండర్ కొల్లూరి సత్తయ్య అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు సమావేశంలో కొల్లూరి సత్తయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావన్నారు. గద్దర్ తెలంగాణ సాధన ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాల్లో ముందు నడిచి నిలబడ్డాడని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ , బీజేపీ నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చాడని , ఆ సమయంలో బండి సంజయ్ రాజకీయాల్లో కూడా లేరని విమర్శించారు.
తన పాటలతో తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన వీరుడు గద్దర్ అని తెలంగాణ ప్రజా రాజ్యాం పార్టీ అధ్యక్షుడు జీలుకర రవి కుమార్ అన్నారు. బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్పీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో ఓయూలో బండి సంజయ్దిష్టిబొమ్మను చేశారు. బన్సీలాల్‌పేట జబ్బర్కాంప్లెక్స్వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు.