
సంగారెడ్డి, వెలుగు : హిందూ ధర్మ పరిరక్షణ కోసమే బజరంగ్‌దళ్ ఆవిర్భవించిందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాంసింగ్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి చెప్పారు. భారతీయ వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు బజరంగ్‌దళ్ కృషి చేస్తోందన్నారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వరస్వామి మందిరంలో ఆదివారం బజరంగ్‌దళ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 600 మంది త్రిశూల్ దీక్ష తీసుకున్నారు.
అనంతరం రాంసింగ్, బాలస్వామి మాట్లాడుతూ ధర్మకార్యంలో ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నాయని, దేవాలయాల విషయంలో పాలకులు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవులను రక్షించాలని సూచించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, క్రమశిక్షణ, పట్టుదలతో జీవితంలో రాణించాలని సూచించారు. బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఉద్యోగం, వ్యాపారం, చదువు, సంస్కారంలో సమాజానికి ఆదర్శంగా ఉండాలన్నారు. కుటుంబ విలువలు పాటిస్తూ, సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్ ధర్మ ప్రచార్ రాష్ట్ర సహ ప్రముఖ్ మధురనేని సుభాష్ చందర్, రాష్ట్ర ప్రశిక్షణ ప్రముఖ్ ముఖేశ్, శ్రీధర్‌గౌడ్, సంగారెడ్డి జిల్లా కన్వీనర్, ఇతర నాయకులు పాల్గొన్నారు