
- మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల
- పడిపోయిన పసుపు ధరపై అసెంబ్లీలో చర్చ
బాల్కొండ, వెలుగు : పసుపు బోర్డు ఏర్పాటుతో మద్దతు ధర లభిస్తుందనుకున్న రైతులకు ఖరీదు దారుల సిండికేట్ తో తిప్పలు తప్పడంలేదని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల జీరో అవర్ లో తగ్గిన పసుపు ధరపై ప్రసంగించారు. నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాల పసుపు రైతుల సమస్యలను ఆయన లేవనెత్తారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ముందు నిజామాబాద్ మార్కెట్ లో రూ.16వేలకు అమ్ముడు పోయిన పసుపు.... బోర్డు ఏర్పాటు తర్వాత రూ.8వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే పసుపు మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్ లో రూ.13 వేల నుంచి రూ.14 వేలకు కొంటున్నారని తెలిపారు.
నిజామాబాద్ లోని ఖరీదు దారులు సిండికేట్ అయ్యి కొందరు ఆఫీసర్ల సహకారంతో ధర తగ్గిస్తున్నారని ఆరోపించారు. ఒకే రకమైన పసుపుకు రెండు చోట్లా వేరువేరుగా ధర పెడుతున్నారని మండిపడ్డారు. ధరలు పడిపోవడంతో ఆందోళన చెందిన రైతన్నలు రాజకీయాలకు అతీతంగా నిరసనలు చేపట్టారని గుర్తు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు, రూ.15వేల మద్దతు ధర ఇస్తామన్న బీజేపీ హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ లో క్వింటాల్ పసుపు రూ.12వేలకు కొంటామన్న మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు.