బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై మరోసారి మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ . ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, కరీంనగర్ లో రెండు పార్టీలు కలిసి విధ్వంసం సృష్టించాలనుకుంటున్నాయని మండిపడ్డారు. ఎంఐఎం కార్యకర్తలు తన ఇల్లు, ఆఫీస్ పైకి ర్యాలీగా వెళుతూ దాడికి యత్నిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేని ప్రశ్నించారు. ఆత్మరక్షణ కోసం యత్నించిన బీజేపీ కార్యకర్తలపై ఉల్టా కేసులు పెట్టడం ద్వారా సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. తమ సహనాన్ని చేతగాని తనంగా భావిస్తే ఖబడ్దార్... అంటూ హెచ్చరించారు.
తామే నిజమైన దేశభక్తులమని, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము చెప్పినట్లే నడవాలంటూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మీరు దేశభక్తులా.... ఏ దేశానికి? పాకిస్తాన్ కా... ఆఫ్ఘనిస్తాన్ కా? అని ప్రశ్నించారు. మీరు నిజంగా దేశభక్తులే అయితే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంవద్దకు వచ్చి జాతీయ గీతమైన జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలంటూ సవాల్ విసిరారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలు దేరేముందు బండి సంజయ్ కరీంనగర్ ఘటనతోపాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ తీరును తప్పుపడుతూ వీడియో రిలీజ్ చేశారు. ఎంఐం దేశ ద్రోహుల పార్టీఅని... దేశ ద్రోహులు చస్తే సంతాప సభలు నిర్వహించే పార్టీ అని మండిపడ్డారు. ఎంఐఎం అరాచకాలను ఆపేదాకా బీజేపీ పోరాడుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేసి అక్రమ కేసులు పెట్టిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొందరు పోలీసులు ప్రమోషన్లు, పోస్టింగుల కోసం బీఆర్ఎస్ చెప్పుచేతల్లో ఉంటూ బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతూ, రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్, ఎంఐంఎం నేతలు విధ్వంసం స్రుష్టిస్తున్నా, కుట్రలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.
అసలు ఎవరు ఎవరి ఇండ్లపైకి, ఆఫీసులపైకి వెళ్లారని బండి సంజయ్ ప్రశ్నించారు. తమ ధైర్యాన్ని, సాహసాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్దార్... దారుస్సలాంపై జెండా ఎగరేస్తామని హెచ్చరించారు. అనవసరంగా మమ్ముల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దన్నారు. ఎంఐఎం అడ్డా అని చెప్పుకున్న పాతబస్తీకి పోయి కాషాయ జెండా ఎగరేసిన చరిత్ర తమదన్నారు.ఒక పార్టీకి, వర్గానికి కొమ్ము కాస్తే ధీటుగా ఎదుర్కొనే సత్తా బీజేపీకి ఉందనే సంగతిని పోలీసులు, బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.
ఎంఐఎం నేతలు చెప్పినట్లు ఆడటానికి తమది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కాదన్నారు బండి సంజయ్. అణువుణా దేశభక్తిని నింపుకుని ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాషాయ జెండా పట్టుకుని తెగించి కొట్లాడే పార్టీ బీజేపీ అన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను నాశనం చేసేందుకు ఎంఐఎం కుట్రలు చేస్తున్నా నోరు మెదపరా? పాతబస్తీ ప్రజలు దశాబ్దాల తరబడి పేదరికంలోనే మగ్గుతున్నా పట్టించుకోరా? ఓల్డ్ సిటీ న్యూసిటీ కాకుండా చేస్తున్న కుట్రలను అడ్డుకోరా? అని ప్రశ్నించారు.