హైదరాబాద్, వెలుగు: రాత్రి పది దాటితే ఓల్డ్ సిటీ లోకి పోలీసులు రావొద్దంటూ అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడటం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా.. లేక పాతబస్తీ ఏమైనా పాకిస్తాన్ లో ఉందని ఆయన భావిస్తున్నాడా? అని మండిపడ్డారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి నిదర్శనమని తెలిపారు.
ఈ మేరకు బండి సంజయ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు.‘‘ఒక పోలీస్ తప్పు చేస్తే మొత్తం పోలీస్ వ్యవస్థ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సిగ్గుచేటు. పాతబస్తీలో ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఎంఐఎం నేతలు, కార్యకర్తలపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
అక్బరుద్దీన్ బెదిరింపులకు దిగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనం. రాత్రిపూట గుంపులు గుంపులుగా చేరి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. బండ్లపై తిరుగుతూ రోడ్లమీద న్యూసెన్స్ క్రియేట్ చేసే వారిని అడ్డుకోవడం పోలీసుల డ్యూటీ. పోలీసులు తమ డ్యూటీ చేయొద్దని చెప్పడానికి అక్బరుద్దీన్ ఎవరు?’’ అని సంజయ్ ప్రశ్నించారు.