
- నక్సలైట్లే ఓటింగ్‌ను బహిష్కరిస్తరు: బండి సంజయ్
- ప్రజాస్వామ్యంలో ఉంటూ ఎన్నికలకు దూరమా?
- మజ్లిస్‌కు ఓటేసే కార్పొరేటర్ల రాజకీయ భవిష్యత్తు ఖతం
- వక్ఫ్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్, పోటీ చేయకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండేది, ఓటింగ్‌ను బహిష్కరించేది నక్సలైట్లు మాత్రమేనని అన్నారు. ఆ నక్సలైట్ల వారసులే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలని, అలాంటి పార్టీలను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విప్ లకు భయపడి ఓటింగ్ కు దూరంగా ఉన్నా, మజ్లిస్ పార్టీని గెలిపించినా ఆయా పార్టీల కార్పొరేటర్ల రాజకీయ భవిష్యత్తు ఖతం అవుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ బర్కత్ పురాలోని బీజేపీ సెంట్రల్ జిల్లా ఆఫీసులో నగర కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో బండి సంజయ్ శనివారం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు పోటీ చేయకుండా మజ్లిస్‌ను గెలపించాలని చూస్తున్నాయి” అని అన్నారు. మజ్లిస్ తో కలిసి ఆ రెండు పార్టీలు అంటకాగుతున్నాయన్న విషయాన్ని వాడవాడలా ప్రచారం చేయాలని చెప్పారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచామని, ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగరవేయడం తథ్యమన్నారు. పార్టీ కోసం, సిద్ధాంతం కోసం నిరంతరం పని చేసిన గౌతమ్ రావును ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు.
మజ్లిస్ సభ వెనకున్నది కాంగ్రెస్సే..
రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలే లేవని, ఆ పార్టీల భవిష్యత్తు కాలగర్భంలో కలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు. మజ్లిస్ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాతబస్తీలో జరిగే బహిరంగ సభకు కర్త, కర్మ, క్రియ అంతా కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. కాంగ్రెస్ సూచన మేరకే మజ్లిస్ పార్టీ ముస్లిం సంఘాలతో కలిసి బహిరంగ సభ పెడుతోందన్నారు. రాష్ట్రంలో 77 వేల ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలముంది. దీనిద్వారా వందల కోట్ల ఆదాయం వస్తోంది. ఆ సొమ్ముతో ఏ ఒక్క పేద ముస్లిం కుటుంబానికైనా న్యాయం చేశారా? ధైర్యముంటే తెలంగాణలో వక్ఫ్ ఆస్తులెన్ని? ఆ వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.