
- కర్త, కర్మ, క్రియ అంతారేవంత్ రెడ్డినే: బండి సంజయ్
- పేద ముస్లింల అభ్యున్నతి కోసమే వక్ఫ్ సవరణ అని వెల్లడి
పెద్దపల్లి, వెలుగు: వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా బడా చోర్లంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ మీటింగ్కు కర్త, కర్మ, క్రియ సీఎం రేవంత్ రెడ్డే అని విమర్శించారు. పేద ముస్లింల అభ్యున్నతి కోసమే బీజేపీ వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చిందన్నారు. ఓల్డ్ సిటీలో అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ నిజమైన వారసుడు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పెద్దపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం చేపట్టిన కార్యక్రమం.. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ముస్లింలలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయి. అలజడులు రేపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. వక్ఫ్ చట్టం ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. వక్ఫ్ బోర్డు దౌర్జన్యంగా భూములు లాగేసుకుంటున్నదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుడులు, చర్చీలు, గురుద్వారాలు కూడా తమవే అని వక్ఫ్ బోర్డు నోటీసులు ఇవ్వడం దారుణం.
టైటిల్ లేని భూములన్నీ వక్ఫ్ కింద జమ చేసుకుంటున్నారు. సుప్రీం కోర్టు వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను’’అని బండి సంజయ్ అన్నారు. పాత వక్ఫ్ చట్టం ద్వారా వేల కోట్ల ఆదాయం వచ్చినా.. ఒక్క పేద ముస్లిం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. కొందరు బడా ముస్లింల జేబులు నింపేందుకు వక్ఫ్ బోర్డు ఉపయోగపడుతున్నది. ‘‘సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులేవీ లేవు. లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని గొప్పలకు చెప్పుకుంటున్నరు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి.
వడగళ్ల వానకు వరి, మామిడి రైతులు నష్టపోయారు. అందరికీ నష్టపరిహారం ఇవ్వాలి’’అని సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.