బండ్లగూడ చెరువుకు గండి

బండ్లగూడ చెరువుకు గండి

ఎల్ బీ నగర్, వెలుగు: బండ్లగూడ చెరువు కట్టకు బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గండి కొట్టడంతో చెరువు కింద ఉన్న ఆనంది ఎన్​క్లేవ్, పద్మావతి కాలనీలు జలమయమయ్యాయి. గురువారం పొద్దున ఇళ్ల ముందు భారీగా నీళ్లు నిలవడంతో ఈ ప్రాంతాల వాసులు ఆందోళనకు గురయ్యారు. కొందరు చెరువు వైపు వెళ్లి చూడగా గండి పడినట్లు గుర్తించారు. వారి సమచారంతో వాటర్ బోర్డు అధికారులు వచ్చి సాయంత్రం వరకు తీవ్రంగా శ్రమించి వరదను డ్రైనేజీలోకి డైవర్ట్ చేశారు. కాగా ఇరిగేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వాటర్ బోర్డు ఆఫీసర్లు, స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు వద్ద పనులు చేపట్టేందుకు ఇలా గండికొట్టి ఉంటారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఆఫీసర్ల నిర్లక్షమే కారణమంటూ ఇరిగేషన్ ఆఫీసర్లు అంటున్నారు. చిన్న చెరువులోకి పైనుంచి వచ్చే డ్రైనేజీని తీసుకురావడంతోనే సమస్య తలెత్తిందని ఆరోపిస్తున్నారు. అధికారులు తప్పును ఒకరిపై ఒకరు నెట్టుకొంటూ తమ ప్రాణాలతో ఆడుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.