మరణం లేని మహావీరుడు నేతాజీ : బసవరాజు నరేందర్ రావు

  • సుభాష్​ చంద్రబోస్ ​జయంతి ఇయ్యాల

బెర్లిన్ ఎయిర్​పోర్టులో ఇటలీ దౌత్యవేత్త ఆర్లెండో మొజట్టా పాస్​పోర్ట్, వీసా చెకప్​పూర్తయి, జర్మనీలోకి ఆయన ప్రవేశానికి అనుమతి లభించింది. భారత దేశంలోని కలకత్తా నగరంలో   ప్రారంభమై, అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఒక యాత్రికుడి సుదీర్ఘ యాత్ర సుఖాంతమైంది. ఆర్లెండో మొజట్టాగా జర్మనీలోకి ప్రవేశించింది మరె వరోకాదు- కలకత్తాలో ప్రభుత్వం విధించిన గృహనిర్బంధం నుంచి తప్పించుకొని, మారుపేర్లతో ప్రయాణిస్తూ తన ఆశయ సిద్ధి కోసం జర్మనీ చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ మన సుభాష్​చంద్రబోసే.

సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్న బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను జైలులో పెట్టింది. ఆయన అక్కడ నిరాహార దీక్ష చేయడంతో ఆరోగ్యం క్షీణించి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయనకు గృహ నిర్భంధం విధించారు. ఆయన అక్కడి నుంచి మారు వేషంలో తప్పించుకొని పెషావర్ చేరుకొని తనపేరు జియాఉద్దీన్ గా చెప్పుకున్నాడు. తర్వాత జియాఉద్దీన్ కాబూల్ చేరుకుని ఇటలీ, జర్మనీ దౌత్యాధికారుల సహకారంతో ఆర్లెండొ మొజట్టా పేరుతో ఇటలీ పాస్ పోర్ట్  పొంది తన ఆశయం నెరవేర్చుకునేందుకు జర్మనీ చేరుకున్నాడు. అలా చేరుకున్న ఆయన సుభాష్ చంద్రబోసని తెలుసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం నివ్వెరపోయింది. జర్మనీలో బోస్​ హిట్లర్ ను కలుసుకున్నాడని తెలిసి ఆందోళన చెందింది. 

నేతాజీ బిరుదు, జైహింద్​నినాదం

అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. ప్రపంచంలోని పలు దేశాలు మిత్ర రాజ్యాలుగా, శత్రురాజ్యాలుగా విడిపోయి తలపడ్డాయి. బ్రిటన్ మిత్ర రాజ్యం.  జర్మనీ శత్రురాజ్యం. అంటే అది బ్రిటీష్ ప్రభుత్వానికి శత్రురాజ్యం. మన శత్రువుకు శత్రువు మనకు మిత్రుడన్న సూత్రాన్ననుసరించి జర్మనీ సహకారంతో స్వాతంత్ర్యం సాధించాలనుకున్నాడు సుభాష్ చంద్రబోస్. అందుకే జర్మనీ వెళ్లాడాయన. జర్మనీలో ఉన్న సమయంలో స్వేఛ్ఛా భారత కేంద్రాన్ని,  ఒక రేడియో కేంద్రాన్ని, దాంతో పాటే జర్మనీలోనున్న భారత యుద్ధ ఖైదీలతో కూడిన ఒక సైనిక పటాలాన్ని స్థాపించాడు. దానికి ఇండియన్ లెజియన్ అని నామకరణం చేశాడు. ఇండియన్ లెజియన్ యోధులే ఆయనను నేతాజీ బిరుదుతో గౌరవించారు. జైహింద్ అన్న నినాదం అక్కడే రూపుదిద్దుకొంది.

గాంధీజీతో ఇమడలేక..

ఇక సుభాష్ చంద్ర బోస్  గతాన్ని పరిశీలిస్తే ఆయన జనవరి 23, 1897 రోజున కటక్ పట్టణంలోని  జానకి నాథ్ బోస్,  ప్రభావతి దంపతులకు  తొమ్మిదవ  సంతానంగా జన్మించాడు. జానకి నాథ్ బోస్  న్యాయవాది. తల్లి ఒక ఆదర్శ గృహిణి.  సుభాష్ చంద్ర  కటక్ లోని  స్కాటిష్ చర్చ్ కాలేజ్ నుంచి పట్టభద్రుడయ్యాడు. తరువాత తండ్రి కోరిక మేరకు  ఇంగ్లండ్ వెళ్ళి  ఐసీఎస్ సాధించాడు. అయితే  బ్రిటిష్  ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేక ఐసీఎస్ కు రాజీనామా చేశాడు. భారత దేశం తిరిగి వచ్చి కాంగ్రెస్  పార్టీలో చేరి, గాంధీజీ  నాయకత్వంలో స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు. గాంధీజీ అహింసావాది, సమ్మెల ద్వారా, నిరసనల ద్వారా స్వాతంత్ర్యం సాధించవచ్చని భావించేవాడాయన. సుభాష్ చంద్ర దీనికి విరుద్ధం. కేవలం బల ప్రయోగం ద్వారానే బ్రిటీష్ ప్రభుత్వాన్ని పారదోలగలమని భావించేవాడాయన. అందువల్ల  సుభాష్ , గాంధీజీ తో ఇమడలేక పోయాడు. 

ఇండియన్​ నేషనల్ ​ఆర్మీ చీఫ్ గా..

సరిగ్గా అదే సమయంలో తూర్పు ఆసియాలో యుద్ధం విస్తరించింది. అక్షరాజ్యమైన జపాన్ బ్రిటీష్ సైన్యాన్ని బందీలుగా పట్టుకుంది. ఆ సైన్యంలో ఎందరో భారత సైనికులున్నారు. మరోవైపు జపాన్ లో స్థిరపడిన విప్లవ వీరుడు రాస్ బిహారి బోస్ దేశ స్వాతంత్ర్య సాధన కోసం ‘ఇండియా ఇండిపెండెన్స్​లీగ్’ స్థాపించాడు. దానికి అనుబంధంగా ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ అనే ఒక మిలిటరీ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. అయితే  అప్పటికే జర్మనీలో ఉన్న సుభాష్ చంద్ర నాయకత్వంలో లీగ్ మరింత సమర్థంగా పని చేస్తుందని భావించిన రాస్ బిహారి బోస్  సుభాష్ ను తూర్పు ఆసియా రావాలని కోరాడు. దానికి సమ్మతించిన సుభాష్ చంద్ర   అత్యంత ప్రమాదకరమైన సబ్ మెరైన్ ప్రయణం చేసి 1943 జులై 2 న సింగపూర్ చేరుకున్నాడు. జులై 4న లీగ్ బాధ్యతలు  స్వీకరించి ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ యోధులనుద్దేశించి ఉత్తేజ పూరిత ప్రసంగం చేసి ‘చలో ఢిల్లీ’  నినాదాన్ని వారికి అందించాడు. అదే ఏడాది ఆగస్టు​26న ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ సర్వ సైన్యాధ్యక్షుడిగాబాధ్యత స్వీకరించాడు. తర్వాత జపాన్ సహకారంతో అక్టోబర్1943లో స్వతంత్ర  భారత (తాత్కాలిక) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు నేతాజీ. 

జయంతి తప్ప.. వర్ధంతి లేదు

1945లో మిత్ర రాజ్యాలకు జపాన్ తలవంచింది. జపాన్ పరాజయంతో ఐఎన్​ఏ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నేతాజీ  రష్యా సహకారంతో తన లక్ష్యాన్ని సాధించుకోవాలనుకున్నారు. రష్యా వెళ్లేందుకు 1945 ఆగస్టు18న తన సన్నిహితుడు హబీబ్-ఉర్ -రహమాన్ తో కలిసి తైపె నుంచి డెరియన్ వెళ్లే విమానమెక్కాడు. అయితే విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక లోపం వల్ల నేలకూలింది. ఆ తరువాత నేతాజీకి సంబంధించిన  వార్తలు వివాదాస్పదమయ్యాయి. విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడని కొందరు, లేదు-లేదు ఆయన రష్యాలో బందీ అయ్యాడని మరికొందరు, కాదు–కాదు ఆయన యోగిగా మారాడని ఇంకొందరు నమ్ముతున్నారు. అందుకే నేతాజీకి జయంతులే కానీ, వర్ధంతులు లేవు. ఏది ఏమైనా, కోట్లాది మంది భారతీయుల గుండెల్లో ఆయన స్థిర నివాసమేర్పరుచుకున్నాడు అన్న మాట మాత్రం చెక్కు చెదరని నిజం.  

- బసవరాజు నరేందర్ రావు, అడ్వొకేట్​