- అక్టోబర్ 2న వెయ్యిస్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ షురూ
- సద్దుల బతుకమ్మకు కేరాఫ్ హనుమకొండ పద్మాక్షి, వరంగల్ ఉర్సు గుట్ట
- ఆటపాటలకు లక్షలాదిగా తరలిరానున్న మహిళలు
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో బతుకమ్మ జోష్ వచ్చేసింది. రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఫేమస్ అవగా..ఉమ్మడి వరంగల్ జిల్లా.. బతుకమ్మ ఆటపాటలకు కేంద్రంగా నిలుస్తోంది. ఏండ్ల తరబడి మిగతా ప్రాంతాలకు భిన్నంగా గ్రేటర్ వరంగల్లో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
2 నుంచి వేడుకలు
అక్టోబర్ 2 నుంచి 10 వరకు బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రేటర్ వరంగల్ బల్దియా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ సిటీ పరిధిలోకి వందలాది కాలనీలు పెరిగిన నేపథ్యంలో.. మహిళలు దగ్గర్లోనే బతుకమ్మ ఆడిపాడేలా సిటీలో దాదాపు మరో 10 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
వెయ్యిస్తంభాల గుడి, పద్మాక్షి టెంపుల్.. వేదిక
ఓరుగల్లులో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. గ్రేటర్ వరంగల్ ట్రైసిటీ పరిధిలోని వందలాది కాలనీల మహిళలు మొదటిరోజు ఆటపాటల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున ఇక్కడకు రావడం ఆనవాయితీ. ఆతర్వాత అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాన బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ పేర్లతో ఎనిమిది రోజుల పాటు వేడుకలు జరుగుతాయి.
అక్టోబర్ 10న హనుమకొండలోని పద్మాక్షి ఆలయ ప్రాంతం, వరంగల్ హంటర్‌రోడ్‌లోని ఉర్సు గుట్ట వేదికగా సద్దుల బతుకమ్మ సంబురం జరుగుతుంది. లక్షలాది మంది మహిళలు, యువతులు తరలివచ్చి ఆటపాటల అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు.
బతుకమ్మ ఏర్పాట్లలో..అధికారులు బిజీ
గ్రేటర్ వరంగల్లో అక్టోబర్ 2న ఎంగిలిపూల బతుకమ్మ, 10న సద్దుల బతుకమ్మ, 12న దసరా ఉత్సవాల ఏర్పాట్లలో అధికారులు బిజీ అయ్యారు. వెయ్యిస్తంభాల గుడితో పాటు పద్మాక్షి గుడి గుండం, వరంగల్ ఉర్సు గుట్ట చెరువు, ఓ సిటీ, మడికొండ మెట్టుగుట్ట ప్రధాన ప్రాంతాల్లో.. అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతుండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాట్లు చేస్తున్నారు.
బతుకమ్మ నిమజ్జనg చేసే చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించే పనులు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏర్పాట్లపై దేవాదాయ, రెవెన్యూ, విద్యుత్, సాగునీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీస్, మత్స్య, తదితర శాఖల అధికారులు, ఆలయ అర్చకులతో శనివారం రివ్యూ నిర్వహించారు. పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ కంట్రోల్, లైటింగ్ ఏర్పాటు, అంబులెన్స్‌లు, శానిటేషన్ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు.