ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన పోరాట యోధుడు.. 

వెలేసిన గుడిసెల నుండి ఎలివేట్ అయిన వెలుగు రేఖ బత్తుల శ్యాం సుందర్‌‌‌‌. అంబేద్కర్‌‌ను ఆరాధించడం కాదు ఆయన ఆశయాలను ఆచరించాలని చాటిన నిజమైన, నిఖార్సైన అంబేద్కర్‌‌వాది ఆయన. వేల ఏండ్లుగా వెట్టికి, అంటరాని తనానికి గురై.. మూతికి ముంత, వెనుక చీపురుతో మనుషులుగా సైతం గుర్తించకుండా.. జంతువుల కన్నా హీనంగా బతుకులు ఈడుస్తూ.. ఊరికి దూరంగా ఉంటూ.. కూడు, గూడు, గుడ్డకు నోచుకోకుండా.. చీకటిలో మూలుగుతున్న వెలివాడల్లో వేగు చుక్కై వెలిశాడు శ్యాం సుందర్. దళిత  ప్రజలను దండు కట్టి లాక్కున్న హక్కులను బలవంతంగానైనా తెచ్చుకోవాల్సిందే. బతిమాలితే హక్కులు కాదు కదా బిక్షంకూడా దొరకదు.. అంటూ మూల భారతీయ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉక్కు మనిషే కాదు..దళితుల శక్తిని, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికల్లో ఎలుగెత్తి చాటిన పోరాట యోధుడు ఆయన. 


నిజాం పరిపాలనా సమయంలో 21 డిసెంబర్ 1908న  మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌‌లో ఒక సామాన్య మాల కుటుంబంలో శ్యాం సుందర్‌‌‌‌ జన్మించాడు. తర్వాత అక్కడి నుండి నిజాం రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్​కు మకాం మార్చారు ఆయన కుటుంబీకులు. అప్పటికే దేశమంతా బాబాసాహెబ్ డా.బీఆర్‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌ అణగారిన ప్రజల హక్కుల కోసం గళమెత్తి నినదిస్తుంటే ఆయన అడుగు జాడల్లో తన అడుగులు కలిపాడు శ్యాం సుందర్‌‌‌‌. తెలుగు రాష్ట్రాల్లో దళితోద్యమ తొలి పొద్దులుగా వెలుగుతున్న భాగ్యరెడ్డి వర్మ, బీఎస్ వెంకటరావులతో కలిసి హైదరాబాద్ నిజాం రాష్ట్రంలో దళిత ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళి దళితుల శక్తిని, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికల్లో ఎలుగెత్తి చాటిన పోరాట యోధుడు శ్యాం సుందర్. ఆయన స్వతంత్ర, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. మరాఠి, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ వంటి భాషల్లో అనర్గళంగా మాట్లాడగల బహుభాషా కోవిదుడు. పండితుడు, రాజనీతి దురంధరుడు, పార్లమెంటేరియన్. డా.బీఆర్‌‌‌‌ అంబేద్కర్ తర్వాత షెడ్యుల్డ్ కులాల నుండి అంతటి మేధో సంపత్తి కలిగిన గొప్ప తత్వవేత్త.. బహు గ్రంథ రచయిత శ్యామ్ సుందర్ అని అనడం అతిశయోక్తి కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, న్యాయ శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాడు. విద్యార్థి దశలోనే విద్యార్థి నాయకుడిగా.. వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాడు. ఆ తర్వాత కార్మికుల హక్కుల కోసం కార్మికోద్యమంలో భాగమయ్యాడు. 
 

అంబేద్కర్ ఉద్యమానికి అండగా..

నిజాం హైదరాబాద్ రాష్ట్రంలోని దళితుల సామాజిక,- ఆర్థిక-, రాజకీయ,- సాంస్కృతిక అభివృద్ధి కోసం 1930-–34 మధ్య కాలంలో హైదరాబాద్ లోని దళిత యువతను జాగృత పరిచి ‘‘యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్’’ స్థాపించాడు.  దేశ వ్యాప్తంగా అంబేద్కర్ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడాలనే సంకల్పంతో, అంబేద్కర్‌‌ను రౌండ్‌‌ టేబుల్ సమావేశానికి వెళ్లనివ్వకుండా గాంధీ చేస్తున్న కుట్రలను చిత్తు చేయడానికి ‘‘యూత్ లీగ్ ఆఫ్ అంబేద్కర్‌‌‌‌ రైట్స్’’ స్థాపించాడు. దళితులు, అణగారిన ప్రజల జీవితాల్లో వేల సంవత్సరాలుగా అలుముకున్న అంటరాని తనం, వెనుకబాటు తనం నుండి వెలుగులులోకి రావాలంటే, దోపిడీ దారుల దాస్య శృంఖలాల నుండి విముక్తి పొందాలంటే ‘విద్య’ అనే ఆయుధాన్ని తమ అమ్ముల పొదిలో చేర్చుకోవాలని చెప్పిన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆనాటి నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న బీఎస్​ వెంకట్‌‌రావు గారితో కలిసి, షెడ్యూల్డ్ కులాల ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసి దాని ద్వారా మదర్సా- ఏ- పస్తాఖ్యోం (అస్పృశ్యుల కోసం బడులు) స్థాపించాడు.
 

ప్రత్యక్షంగా పాల్గొన్న పోరాటాలు..

భూమి అంటేనే ఆత్మ గౌరవానికి ప్రతీక, భూమి కలిగి ఉంటేనే దళితులు ఆత్మ గౌరవంతో జీవిస్తారు అని భావించిన శ్యాం సుందర్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న సమయంలోనే దానికి సమాంతరంగా ఉద్యమం నడిపి ప్రభుత్వ అధీనంలో ఉన్న గైరాన్ (బంజరు) భూములను ఆక్రమించుకోవాలని దళితులకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత నిజాంను ఒప్పించి భూ సంస్కరణలు చేయించి, దళితులు ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం గుర్తించేలా చేసి ఆ భూములకు పట్టాలు ఇప్పించాడు. ఆయన నిజాం స్టేట్ రైల్వే ఉద్యోగుల సంఘానికి, డా.బీఆర్​ అంబేద్కర్ స్థాపించిన  షెడ్యూల్డ్ కులాల సమాఖ్యకు, అణగారిన కులాల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నో పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.  దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యరాజ్య సమితిలో ఇతర అనేక అంతర్జాతీయ వేదికలపై అనర్గళంగా మాట్లాడారు. ఆయన వాగ్ధాటికి మంత్ర ముగ్ధులై అంతర్జాతీయ మేధావులైన హెరాల్డ్ లాస్కీ, జీపాల్ సార్త్రే, చైనా అధినేత చౌయెన్‌‌లై వంటి వారు ఆయనకు స్నేహితులుగా మారిపోయారు. శ్యామ్ సుందర్ మూల భారతీయ ఉద్యమానికి పితామహుడు. 
 

గొప్ప హేతువాది..

అంటరానివారిగా ముద్ర వేసిన మేము మూల భారతీయులం. అనాగరికులైన ఆర్యుల రాకకు ముందు ఈ దేశాన్ని ఏలిన పాలకులం. హరప్పా- మోహంజొదారో లాంటి ప్రపంచ స్థాయి నాగరికతలకు పునాదులు వేసిన నిర్మాతలం. మేం ఎప్పటికీ హిందూ మతంలో భాగం కాము. భారత దేశంలో హిందూ మత తత్వంతో కూడిన రాజ్య స్థాపనకు సహకరించం సరికదా, ధ్వంసం చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడమంటూ.. మనువాద హిందూ మత మౌఢ్యంపై అంతిమ శ్వాస వరకు అలుపెరగకుండా పోరాడిన అవిశ్రాంత పోరాట యోధుడు శ్యామ్ సుందర్. మతం మనిషిని విజ్ఞానం వైపు కాకుండా అజ్ఞానం వైపు నడిపిస్తుందని, మతం వల్ల తాడిత పీడిత వర్గాల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు కాబట్టి జ్ఞాన సముపార్జన ద్వారానే జీవితాల్లో సమూల మార్పులు సంభవిస్తాయని చాటి చెప్పిన గొప్ప హేతువాది.
 

రాజకీయ జీవితం..

శ్యాం సుందర్​ కేవలం సామాజిక ఉద్యమాలకే పరిమితం కాకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి అక్కడ కూడా ఆయన తనదైన ముద్ర వేశాడు. గ్రాడ్యుయేట్ నియోజక వర్గం నుండి హైదరాబాద్ శాసన సభకు ఎన్నికయ్యారు. 1957 లో కర్ణాటకలోని బాల్కీ బీదర్ నుండి విధాన సభకు ఎన్నికై, ఉప సభాపతిగా సమర్థవంతంగా పని చేశాడు. కర్ణాటక విధాన సభలో ఉద్రేక పూరితంగా, విషయ పరిజ్ఞానంతో కూడిన ఆయన ప్రసంగాలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఇలాంటి నాయకుడు పార్లమెంట్‌‌లో ఉండాలి అని జర్నలిస్టులు అక్కడక్కడ రాసిన దాఖలాలు ఉన్నాయి. డా. బీఆర్‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌ చూపిన మార్గంలోనే ఈ దేశం సామాజిక,-ఆర్థిక.-రాజకీయ.-సాంస్కృతిక రంగాల్లో రాణించి అభివృద్ది పథంలో ముందుకు వెళ్తుందని బలంగా నమ్మిన నాయకుడు శ్యామ్ సుందర్. 
 

భీంసేన స్థాపించిన ఘనత

దళిత మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అంతం చేయడానికి ఆత్మరక్షణ దళంగా, సామాజిక సాంస్కృతిక విప్లవం వేగవంతం చేయడానికి ‘భీంసేన’ ను స్థాపించారు. దళితులపై ఎక్కడ దాడులు జరిగినా భీంసేన ప్రతిఘటించేది. అంతే కాదు అంబేద్కర్ రచనలను, ఆశయాలను భీంసేన విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఇవాళ అంబేద్కరిజం ఇంతగా వెలుగుతోంది అంటే కారణం నాడు శ్యామ్ సుందర్ భీంసేన ద్వారా చేసిన కృషే. నేడు ‘జై భీమ్-జై మీమ్’ నినాదం ద్వారా ప్రచారంలోకి వస్తున్న దళితులు- ముస్లింలు ఐక్యత గురించి ఆయన అనాడే చెప్పాడు. దళితులు- ముస్లింలు రాజ్యాధికారం కోసం జట్టు కట్టాలని, 30 శాతం ఉన్న దళిత గిరిజనులు 13% ఉన్న ముస్లింలు కలిస్తే రాజ్యాధికారం సాధించవచ్చని ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి దారి తీసిన నీళ్ళు- నిధులు -నియామకాల ఆవశ్యకతను వివరిస్తూ ప్రధాన మంత్రికి అనేక సార్లు ఉత్తరాల ద్వారా తెలియజేశాడు. రచయితగా మూల భారతీయులు, సజీవ దహనం, భూ దేవతోం కా మేనిఫెస్టో, భీం సేన అవర్ పాస్ట్ అండ్ ప్రజంట్​, దే బర్న్, చైనా దురాక్రమణ గురించి వివరిస్తూ మినేస్ ఆఫ్ ది డ్రాగన్ వంటి అనేక పుస్తకాలను రాశాడు. అణగారిన జాతుల హక్కుల కోసం ఆయన నిరంతరం చేస్తున్న పోరాటానికి, సమాజానికి చేసిన సేవలకు బహుమానంగా నిజాం ప్రభుత్వం ఆయనకు ఖుస్రూ-ఎ-దక్కన్ అనే బిరుదును ఇచ్చి గోల్డ్ మెడల్ ద్వారా ఘనంగా సత్కరించింది. 
 

సమాజ శ్రేయస్సుకోసం ఆస్తులను వెచ్చించాడు..

సమాజ శ్రేయస్సు కోసం తన శక్తి యుక్తులను, ఆస్తులను వెచ్చించిన శ్యామ్ సుందర్ తన చివరి రోజుల్లో కడు పేదగా మిగిలిపోయాడు. నిజాం నవాబుతో సాన్నిహిత్య సంబంధమున్నా.. ప్రముఖులు, ఉన్నత అధికారులు, ఉద్యోగులతో సంబంధాలున్నా, సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నా, తన చివరి రోజుల్లో పేదరికం వెంటాడుతున్నా, ఎవరినీ పైసా అడగని నైజం ఆయనది. పెళ్లి తన ఉద్యమానికి అడ్డంకిగా మారుతుందని భావించి బ్రహ్మచారిగా మిగిలిపోయాడు.  పదవులు, హోదాలున్నా హంగులు ఆర్భాటాలు లేకుండా అతి సామాన్యమైన జీవితాన్ని గడిపిన నిరాడంబరుడు. నమ్మిన అంబేద్కర్ సిద్ధాంతం కోసం, కోరుకున్న ‘స్వేచ్ఛ- సమానత్వం -సౌభ్రాతృత్వం’ పరిఢవిల్లే సమసమాజ స్థాపన కోసం పరితపించిన శ్యామ్ సుందర్ 19 మే 1975 న గుండె పోటుతో మరణించాడు. 

                                                                                                              - మంచాల లింగస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్