![కులగణన రిపోర్టును స్వాగతిస్తున్నం : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్](https://static.v6velugu.com/uploads/2025/02/bc-commission-chairman-gopisetty-niranjan-said-welcome-caste-census-survey-introduced-by-state-government_HLbvXElDei.jpg)
- ఇక బీసీల రిజర్వేషన్ల సాధనపై దృష్టి పెడదాం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేను స్వాగతిస్తున్నామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. 94,261 ఎన్యుమరేషన్ బ్లాక్‌లను ఏర్పాటు చేసి.. 1,03,889 ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించి.. సుమారు 50 రోజులపాటు ఈ సర్వే చేశారని ఆయన తెలిపారు. 96.9 శాతం మంది ప్రజలు సర్వేలో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో మెంబర్లు బాలలక్ష్మి, జయప్రకాశ్, సురేందర్ తో కలిసి నిరంజన్ మీడియాతో మాట్లాడారు. కులగణన డేటాను ఇవ్వాలని త్వరలో ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ను కోరుతామని చైర్మన్ తెలిపారు.“బీసీలు మొత్తం 56 శాతం పైనే ఉన్నారు.
ప్రస్తుతం ఆశిస్తున్న 42 శాతం రిజర్వేషన్ల కంటే ఇది 14.33శాతం ఎక్కువ. సర్వే రిపోర్ట్ అసెంబ్లీ ముందు పెట్టిన తర్వాత బీసీల సంఖ్య తక్కువా? ఎక్కువా? అనే తర్జనభజన కంటే.. ఆశించిన మేరకు రిజర్వేషన్లను ఎలా సాధించుకుందామనే విషయంపై దృష్టి పెట్టాలని కమిషన్ విజ్ఞప్తి చేస్తుంది. ఈ దిశలో కమిషన్ కూడా తన వంతు కృషి చేస్తుంది. బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ చేపట్టిన సమయంలో ఆయా ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లను, సంబంధిత అధికారులను కూడా కలిసి క్షేత్రస్థాయి సమాచారాన్ని తీసుకున్నం. ఎన్యూమరేటర్లు ప్రశ్నావళి ద్వారా సేకరించిన సమాచారాన్ని కూడా పరిశీలించాం.
డాక్యుమెంటేషన్, కంప్యూటరీకరణ కూడా ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని కూడా పరిశీలించాం. డాక్యుమెంట్లను భద్రపరిచిన గదులను కూడా తనిఖీ చేశాం. బీసీ నాయకులు, బీసీ సంఘాలు సర్వేలో తేలిన బీసీల సంఖ్యపై తర్జనభర్జనలకు తావివ్వకుండా వచ్చిన సంఖ్య మేరకు రిజర్వేషన్స్ సాధించుకుంటే బీసీ ప్రజల కల నెరవేరుతుంది” అని నిరంజన్ తెలిపారు. కొన్ని కులాల పేర్ల మార్పులపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించామని, ఈ అధ్యయనంలో భాగంగా ఆయా కులాల వారి జీవన స్థితిగతులను పరిశీలించేందుకు ప్రత్యక్షంగా జిల్లాల్లో పర్యటిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్ల అమలును పరిశీలించడానికి, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులందరి వివరాలను సేకరించాలని నిర్ణయం తీసుకున్నామని నిరంజన్ పేర్కొన్నారు.