కులగణన రీసర్వేకు అందరూ సహకరించాలి

కులగణన రీసర్వేకు అందరూ సహకరించాలి
  • బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్
  • 16 నుంచి 28 వరకు జీహెచ్ఎంసీలో పర్యటన 

హైదరాబాద్, వెలుగు: కులగణన రీసర్వేకు అందరూ సహకరించాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోరారు. శుక్రవారం బీసీ కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. కులగణనలో గతంలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడాన్ని బీసీ కమిషన్ స్వాగతిస్తుందన్నారు. 

అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని నిర్ణయించడం కూడా గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, ప్రజా పాలన సేవా కేంద్రాల ద్వారా, ఆన్ లైన్ ద్వారా సంబంధిత ప్రశ్నావళి ఫార్మాట్లను స్వీకరించాలని నిర్ణయించినందున ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. 

హైదరాబాద్ లో తక్కువ కులగణన జరిగిన ప్రాంతాల్లో బీసీ కమిషన్ సభ్యులతో కలిసి ఈ నెల16 నుంచి 28 వరకు పర్యటించనున్నట్టు తెలిపారు. రోజూ ఉదయం 8 నుంచి  రాత్రి10 గంటల వరకు వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. జీహెచ్ఎంసీ వద్ద ఉన్న16 లక్షల టెలిఫోన్ నంబర్ల ద్వారా కూడా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించామన్నారు. 

కేంద్రం జనగణన చేపట్టాలి.. 

దేశవ్యాప్తంగా జనగణన చేపట్టి అందులో కులాల వారీగా సమాచారం సేకరించాలని.. బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నిరంజన్ విజ్ఞప్తి చేశారు. గతంలో 2006, 2013, 2019 ఎన్నికల్లో రిజర్వేషన్ల సీట్లతో కలిపి సర్పంచ్ స్థానాలకు 43.5%, వార్డ్ మెంబర్ స్థానాలకు 50.4% బీసీలు గెలిచారని తెలిపారు. అలాగే ఎంపీపీలు 43.4%, ఎంపీటీసీలు 46.7%, జడ్పీటీసీలు 39.2% గెలిచారన్నారు. మున్సిపాలిటీలో వార్డు మెంబర్లుగా 59%, చైర్ పర్సన్లుగా 51 %, మేయర్లుగా 31%, కార్పొరేటర్లుగా 57% బీసీలు విజయం సాధించారన్నారు. 42% రిజర్వేషన్లు ఇస్తే.. మిగతా సీట్లను కలుపుకుని బీసీలు 70% గెలిచే చాన్స్​ ఉందన్నారు.