కులగణనపై జిల్లాలకు బీసీ కమిషన్

  • సలహాలు, సూచనలు తీసుకోనున్న కమిషన్ సభ్యులు

హైదరాబాద్, వెలుగు: కులగణన, లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై జిల్లాల్లో బీసీ కమిషన్ పర్యటించనుంది. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్ల పెంపు, కుల గణనలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై కుల సంఘాల నేతలు, బీసీ మేధావుల నుంచి సలహాలు, సూచనలు తీసు కోనున్నారు. వచ్చే వారంలో జిల్లాల టూర్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. 

శనివారం ఖైరతాబాద్​లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్, మెంబర్లు బాలలక్ష్మి, సురేందర్, జయప్రకాశ్​తో పంచాయతీ రాజ్ సెక్రటరీ లోకేశ్ కుమార్, కమిషనర్ అనితా రాంచంద్రన్, బీసీ వెల్ఫేర్ కమిషనర్, కమిషన్ మెంబర్ సెక్రటరీ బాలమాయదేవి సమావేశమయ్యారు. ముఖ్యంగా గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు, అందులో సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్ల ఖరారు, కులగణన విధి విధానాలపై చర్చించారు. 

కులగణనపై ప్రభుత్వం కొద్ది నెలల క్రితం కేబినెట్​లో నిర్ణయం తీసుకోగా, రూ.150 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. కులగణన చేసేందుకు  గైడ్​లైన్స్, గణనలో అడగాల్సిన ప్రశ్నలు ఖరారు చేయగా త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు కమిషన్ ప్రయత్నాలు చేస్తున్నది.