ప్లీనరీలో బీసీల రాజకీయ పాలసీ ప్రకటిస్తాం

నల్గొండ అర్బన్, వెలుగు: జూలై 15న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్  కేబీఆర్ కన్వెన్షన్‌లో10 వేల మంది ప్రతినిధులతో బీసీ రాజకీయ ప్లీనరీని నిర్యహించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ అధ్యక్షతన జరిగిన బీసీ సంక్షేమ, యువజన, విద్యార్థి సంఘాల జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మతో కలిసి చీఫ్‌గెస్టుగా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇస్తామని చెప్పకుండా రాయితీలు, సంక్షేమ పథకాలతో  బీసీ డిక్లరేషన్ అనడం మోసం చేయడమేనని ఆరోపించారు. ప్లీనరీలో బీసీలు రాజ్యాధికారం చేపట్టేందుకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చించి రాజకీయ పాలసీ ప్రకటిస్తామని తెలిపారు. నేతలు వైద్యుల సత్యనారాయణ, బూడిద మల్లికార్జున్, విశ్వనాథ చారి, శంకర్ ముదిరాజ్, లింగం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పానుగంటి విజయ్, నాగరాజ్ గౌడ్, పాలకురి కిరణ్, వరికుప్పాల మధు, నర్సింహ నాయక్, వెంకటేశ్వర్లు, వనం వెంకటేశ్వర్లు, ఆంజనేయులు యాదవ్, సతీశ్ పాల్గొన్నారు.